
హైదరాబాద్ శేరిలింగంపల్లి నుంచి టిడిపి అభ్యర్ధి భవ్య ఆనంద్ ప్రసాద్ తరపున ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు గురువారం ఆ నియోజకవర్గంలో రోడ్ షోలు నిర్వహించించారు. ఆ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ సిఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు.
“హైదరాబాద్ నగరాన్ని నేనే నిర్మించానని నేను చెప్పుకొంటున్నానని కేసీఆర్ నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఆ మాట ఎన్నడూ అనలేదు. అయితే హైటెక్ సిటీ, సైబరాబాద్ నిర్మాణం చేసింది నేనేనని మీ అందరికీ తెలుసు. రెండువారాల పాటు అమెరికాలో కాళ్ళరిగేలా తిరిగి హైదరాబాద్కు అనేక ఐటి కంపెనీలను తీసుకువచ్చి రాష్ట్రానికి ఒక పెద్ద ఆదాయ వనరును సృష్టించాను. హైటెక్ సిటీ, ఐటి రంగం నేనే అభివృద్ధి చేశానని రాష్ట్ర ఐటి మంత్రి కేటిఆర్ స్వయంగా చెప్పారు. కానీ తెలంగాణకు, హైదరాబాద్ నగరానికి నేనేమీ చేశానని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు.
అన్ని విధాలా అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరాన్ని, మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే ఆయన నాలుగేళ్లలో ఏమీ చేయకుండానే రాష్ట్రాన్ని రూ.2.0 లక్షల కోట్ల అప్పులలో ముంచేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెపుతూ మళ్ళీ ఎందుకు ఇన్ని అప్పులు చేశారు? పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తానని చెప్పారు. ఎందుకు కట్టించలేదు? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చారు. ఎందుకు ఇవ్వలేదు. నాలుగేళ్లలో అనేక ప్రాజెక్టులు శరవేగంగా నిర్మించుకొంటున్నామని మీరే చెపుతున్నారు. మళ్ళీ వాటికి నేను అడ్డుకొంటున్నానని ఎలా చెపుతున్నారు? సమైక్యరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో అనేక ప్రాజెక్టులను నేనే ప్రారంభించాను. అటువంటి నేను ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకొంటాను?
ప్రజాకూటమి అధికారంలోకి వస్తే నేను తెలంగాణ రాష్ట్రాన్ని రిమోట్ కంట్రోల్ చేస్తానని కేసీఆర్ మరో వితండవాదం చేస్తున్నారు. ప్రజాకూటమి గెలిస్తే నేను తెలంగాణ ముఖ్యమంత్రిని కాను. ఇక్కడి నేతలే రాష్ట్రాన్ని పాలిస్తారని మీ అందరికీ తెలుసు. వారిలో కొద్దిమంది టిడిపి ఎమ్మెల్యేలు ఉంటే వారి ద్వారా నేను తెలంగాణను రిమోట్ కంట్రోల్ చేస్తానని , తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం నిలిపించేస్తానని కేసీఆర్ ఏవిధంగా చెపుతున్నారు? కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్పి ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. అయినా తెలంగాణ దిగువున ఉన్న మేము ఏవిధంగా ఎగువున ఉన్న ప్రాజెక్టులను అడ్డుకోగలము? తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాలి.
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సమస్యలలో ఉన్నప్పటికీ నేను మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొనేందుకు ఎంతో కృషి చేస్తున్నాను. కానీ తెలంగాణ రాష్ట్రం ఆర్ధికంగా చాలా బలంగా ఉన్నప్పటికీ, కేసీఆర్ ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోగా ఉన్న వ్యవస్థలను అన్నిటినీ ధ్వంసం చేసి రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారు. అక్కడ కేంద్రంలో పెద్దమోడీ ఉంటే...ఇక్కడ రాష్ట్రంలో చిన్నమోడీ-కేసీఆర్ ఉన్నారు. వారిద్దరివి నియంతృత్వ పోకడలే. ఇద్దరూ వ్యవస్థలన్నిటినీ ధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రంలో, దేశంలో ప్రజాస్వామ్యాన్ని , రాజ్యాంగ వ్యవస్థలను బలోపేతం చేయడమ్ కోసం వారిరువురినీ తొలగించిక తప్పదు. అందుకే మేము ప్రజాకూటమిని ఏర్పాటు చేశాము. ఈ నాలుగేళ్లలో ఆయన ఏమి చేయకపోవడంతో తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే నన్ను విమర్శిస్తూ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికలలో గెలవాలని కలలు కంటున్నారు. కానీ ఈ ఎన్నికలలో ప్రజాకూటమి తప్పకుండా గెలుస్తుంది...అధికారంలోకి వస్తుంది,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.