
ఖమ్మం జిల్లా సత్తుపల్లి బిజెపి అభ్యర్ధి నంబూరి రామలింగేశ్వరరావు తరపున బుదవారం ఎన్నికల ప్రచారం చేసిన ఆ పార్టీ నేత దగ్గుబాటి పురందేశ్వరి, ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న సండ్ర వెంకట వీరయ్య ఈ నియోజకవర్గం అభివృద్ధికి చేసిందేమీ లేదు. ఆయన ఓటుకు నోటు కేసులో కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోతుంది. ఇక ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెరాస అభ్యర్ధి పిడమర్తి రవి (మాజీ తెరాస ఎమ్మెల్యే) ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నప్పటికీ ఆయన కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా నాలుగేళ్లు కాలక్షేపం చేసి మళ్ళీ ఇప్పుడు ఓట్ల కోసం మీ ముందుకు వచ్చారు.
రాష్ట్రంలో పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, ఇంటికో ఉద్యోగం, దళితులకు 3 ఎకరాల భూమి, కేజీ-టు-పీజీ ఉచితవిద్య అందిస్తామని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ అనేక హామీలు గుప్పించారు. కానీ నేటికీ వాటిని అమలుచేయలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు సరికొత్త హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారు.
ఇక ఈ ఎన్నికలలో ఏదోవిధంగా గెలిచి రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలనే తాపత్రయంతోనే కాంగ్రెస్-టిడిపిలు కూటమిగా ఏర్పాడ్డాయి. ఏ మాత్రం భావస్వారూప్యత లేని ఆ నాలుగు పార్టీలు అధికారం కోసం కూటమి కట్టడం చాలా విచిత్రంగా ఉంది.
ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఏవిధంగా అభివృద్ధి పధంలో ముందుకు నడిపిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక రాష్ట్రంలో కూడా బిజెపిని, సత్తుపల్లి నుంచి పోటీ చేస్తున్న నంబూరి రామలింగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.