
కొడంగల్ తెరాస అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి, ఆయన సమీప బందువుల ఇళ్లపై నిన్న తెల్లవారుజామున ఐటి అధికారులు దాడులు చేసి కోట్లు రూపాయల నగదు స్వాధీనం చేసుకొన్నారని మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఎన్నికలలో తనను దెబ్బ తీసేందుకే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతోందని ఆయన అన్నారు.
అయితే ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ ఐటి రెయిడ్స్ జరగడం, డబ్బు పట్టబడటం నిజమేనని దృవీకరించారు. ఐటి రెయిడ్స్ కు సంబందించిన వివరాలు తనకు సీల్డ్ కవరులో అందజేశారని, దానిని పరిశీలించిన తరువాత ఆ వివరాలు మీడియాకు తెలియజేస్తామని చెప్పారు.
దీనిపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ, “నన్ను ఓడించేందుకు తెరాస రూ.100 కోట్లు ఖర్చు చేయబోతోందని అప్పుడే చెప్పాను. ఇప్పుడు అదే నిజమని రుజువవుతోంది. నాకు లభించిన సమాచారం ప్రకారం పట్నం నరేందర్ రెడ్డి, ఆయన బందువుల ఇళ్ళలో రూ.15 కోట్లు నగదు, మరో రూ.25 కోట్లు నగదు చెల్లింపులకు సంబందించిన చీటీలు లభించాయి. కానీ సిఎం కేసీఆర్ ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి పట్నం నరేందర్ రెడ్డిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను,” అని అన్నారు.
తాజా సమాచారం ప్రకారం ఐటి రెయిడ్స్ లో సుమారు రూ.51 లక్షల నగదు లభించినట్లు తెలుస్తోంది. అయితే రజత్‌కుమార్ వీటిని దృవీకరిస్తే కానీ ఈ వార్తలలో నిజానిజాలు తెలియవు.