
హైదరాబాద్ గోషామహల్ బిఎల్ఎఫ్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న చంద్రముఖి (ట్రాన్స్ జెండర్) 27వ తేదీ ఉదయం నుంచి కనబడటం లేదు. ఆ రోజు తెల్లవారుజామున ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చి ఆమెను తీసుకువెళ్లిన్నట్లు సిసి టీవి ఫుటేజీలో ఉందని ఆమె మద్దతుదారులు, బిఎల్ఎఫ్ నేతలు వాదిస్తున్నారు. అప్పటి నుంచి ఆమె ఫోన్ కూడా స్వీచ్ ఆఫ్ లో ఉండటంతో ఆమె తల్లి అనిత తీవ్ర ఆందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు. కానీ రెండు రోజులైనా ఆమె ఆచూకిని కనిపెట్టలేకపోవడంతో ఆమె తల్లి బుదవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ను దాఖలు చేశారు. జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ సత్యనారాయణ మూర్తిలతో కూడిన ధర్మాసనం ఆ పిటిషనుపై తక్షణం విచారణ చేపట్టి చంద్రముఖిని 24 గంటలలోగా తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారు.
చంద్రముఖిని ఎవరో కిడ్నాప్ చేసి ఉండవచ్చునని బిఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధిని రక్షించే బాధ్యత పోలీసులదేనని అన్నారు. దీనికి పోలీసులు, ఎన్నికల సంఘం బాధ్యత వహించాలని అన్నారు. చంద్రముఖిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు చేశారు? అని ఆలోచిస్తే ఆమెను ఎన్నికలలో పాల్గొనకుండా అడ్డుకోవాలని భావిస్తున్నవారెవరో కిడ్నాప్ చేసి ఉండవచ్చని అర్ధం అవుతోంది. పోలీసులు ఈరోజు ఆమెను కోర్టులో హాజరుపరచగలిగితే అసలు ఏమి జరిగిందో తెలుస్తుంది.
ఇప్పుడే అందిన వార్త: చంద్రముఖి విజయవాడలో ఉన్నట్లు కనుగొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడకు వెళ్ళి ఆమెను నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ తీసుకువచ్చి బంజారా హిల్స్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈరోజు ఆమెను హైకోర్టులో ప్రవేశపెడతారు. తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి విజయవాడ తీసుకువచ్చారని చంద్రముఖి చెపుతున్నారు.