అప్పుడు కిరణ్...ఇప్పుడు కేసీఆర్‌?

రాజకీయాలలో కొన్నిసార్లు చాలా విచిత్రమైన పరిణామాలు జరుగుతుంటాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అటువంటి పరిణామం కళ్ల ముందు కనబడుతోంది. 

రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినట్లయితే, రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోతుందని, శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని, రెండు రాష్ట్రాల మద్య నీటి తగాదాలు ఏర్పడతాయని సమైక్యరాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలను భయపెట్టాలని ప్రయత్నించారు. ఆ విషయం సిఎం కేసీఆర్‌ స్వయంగా తన ఎన్నికల ప్రచార సభలలో పదేపదే చెపుతున్నారు కూడా. మనకు పరిపాలించుకోవడం చేతకాదు మనం గొర్రెలం...దద్దమ్మలం అన్నట్లు ఆనాడు ఆంధ్రా పాలకులు మనల్ని ఎద్దేవా చేశారని కేసీఆర్‌ చెప్పడం అందరూ వింటూనే ఉన్నారు. 

ఇప్పుడు కేసీఆర్‌ కూడా ఇంచుమించు అదేవిధంగా చెపుతుండటం విశేషం. ఒకవేళ ఈ ఎన్నికలలో తెరాస ఓడిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్రం మళ్ళీ అంధకారంలోకి వెళ్లిపోతుందని, ఆనాటి అరాచక పరిస్థితులన్నీ పునరావృతం అవుతాయని ప్రజలను హెచ్చరిస్తున్నారు. తాను రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కాలేకపోతే తనకేమీ నష్టం లేదని కానీ రాష్ట్రమే నష్టపోతుందని భయపెడుతున్నారు. కాంగ్రెస్‌ నేతలు, చంద్రబాబు మన వేళ్ళతో మన కళ్ళను పొడుస్తామంటుంటే పొడిపించుకోవడానికి మనమేమైనా గొర్రెలమా? మనకు ఆలోచించుకొనే తెలివితేటలు లేవా?అని ప్రశ్నిస్తున్నారు. 

అప్పుడు రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి ఆవిధంగా ప్రజలను భయపెట్టాలని ప్రయత్నిస్తే, ఇప్పుడు తెరాసను గెలిపించుకోవడానికి కేసీఆర్‌ ఇంచుమించు అదేవిధంగా మాట్లాడుతుండటం చాలా విచిత్రంగా ఉంది.