
కొడంగల్ తెరాస అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి, ఆయన సమీప బందువుల ఇళ్ళపై బుదవారం తెల్లవారుజామున ఐటి అధికారులు దాడులు చేసి చాలా భారీగా డబ్బు కట్టాలను స్వాధీనం చేసుకొన్నారు. నరేందర్ రెడ్డికి సమీపబందువైన జగన్నాధ రెడ్డికి కొడంగల్‌లో గల ఫాంహౌసులో ఐటి అధికారులు దాడులు చేయగా కొన్ని కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్ కూడా దీనిని దృవీకరించారు.
కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి మొదటినుంచి ఒక మాట చెపుతున్నారు. కొడంగల్‌లో తనను ఎలాగైనా ఓడించేందుకు తెరాస వందకోట్లు వరకు ఖర్చు పెట్టడానికి సిద్దమయిందని చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే, రేవంత్‌రెడ్డిని ఓడించడం కోసం అంతా డబ్బు ఎవరూ పణంగా పెడతారని అనుకోరు. అంత సొమ్ము కాకపోయినా నరేందర్ రెడ్డి చాలా భారీగానే ఖర్చుచేయడానికి ఏర్పాట్లు చేసుకొన్నారని రుజువు అయ్యింది. డబ్బు పట్టుబడినట్లు రజత్‌కుమార్ స్వయంగా దృవీకరించారు కనుక మరి నరేందర్ రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకోంటారో చూడాలి. ఒకవేళ ఆయనను ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడుగా ప్రకటించినట్లయితే, రేవంత్‌రెడ్డిని ఏవిధంగానైనా ఓడించి ఆయన చేత రాజకీయ సన్యాసం చేయించాలని తహతహలాడుతున్న తెరాసకు ఇది చాలా పెద్ద దెబ్బేనని చెప్పవచ్చు. అప్పుడు రేవంత్‌రెడ్డి గెలుపు లాంఛనప్రాయమే.