
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొచ్చేసాయని గుర్తు చేస్తూ ఎన్నికల సంఘం నేటి నుంచి రాష్ట్రంలో ఓటర్లకు ఓటర్ స్లిప్పుల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టబోతోంది. ఓటరు స్లిప్పులు ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరుకొన్నాయి. బూత్ స్థాయి ఎన్నికల అధికారులు వాటిని నేటి నుంచి ఇంటింటికీ తిరిగి ఓటర్లకు అందజేస్తారు. వాటిలో ఏవైనా తప్పులున్నట్లయితే ఓటర్లు ఆ విషయాన్ని వెంటనే వారికి తెలియజేయవలసి ఉంటుంది.
ఇప్పటికే నియోజకవర్గాలలో పోలింగ్ బూత్ లను కూడా నిర్ధారించి సజావుగా ఓటింగ్ జరగడానికి ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల గురించి రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం అధికారులు పలుమార్లు సమావేశమయ్యి చర్చించారు. డిసెంబరు 5వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తుంది. డిసెంబరు 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. డిసెంబరు 11వ తేదీన మిగిలిన నాలుగు రాష్ట్రాలతో సహా తెలంగాణలో కూడా ఒకేసారి ఓట్ల లెక్కింపు చేసి ఎప్పటికప్పుడు ఫలితాలు ప్రకటిస్తుంటారు.