1.jpg)
సోమవారం మధ్యాహ్నం కామారెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సిఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఎన్నికలొచ్చినప్పుడు అనేక పార్టీలు..జెండాలు...రకరకాల వాదనలతో అనేకమంది నాయకులు మీ ముందుకు వస్తారు. కనుక అందరినీ చూసి మీరు కన్ఫ్యూజ్ అవనసరం లేదు. అన్ని పార్టీల నేతలు చెప్పినవి శ్రద్దగా వినండి. ఆ తరువాత ఊరులో అందరూ ఒక చోట కూర్చొని ఏ పార్టీ ఏమి చేసింది?మీకు ఎవరు మేలు చేశారు? చేస్తున్నారు? ఎవరికి ఓటేస్తే మీ బ్రతుకులు బాగుపడతాయి? ఎవరు మీ శ్రేయోభిలాషులు?ఎవరు మిమ్మల్ని మోసం చేయడానికి చూస్తున్నారు? అని తాపీగా ఆలోచించండి. అప్పుడు మీకే అర్ధమవుతుంది.
మహాకూటమిలో ముసుగులో మీ ముందుకు వస్తున్న కాంగ్రెస్, టిడిపిల పాలనను మీరు చూశారు. రెండు పార్టీలు కలిపి 50 ఏళ్ళు పైనే పాలించాయి. కానీ తెలంగాణ ఏర్పడేవరకు కరెంటు, నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు? అవి ఇవ్వకపోవడం వలననే కదా మనం పోరాడి తెలంగాణ సాధించుకొన్నాము. ఆ తరువాత నుంచే కదా రాష్ట్రంలో 24 గంటలు కరెంటు, ఇంటింటికీ మంచినీళ్లు, పొలాలకు సాగునీరు, రైతులకు పంటపెట్టుబడి, భీమా, వృద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు లభిస్తున్నాయి. ఈసారి అధికారంలోకి వస్తే ఏదేదో చేసేస్తామని చెప్పుతున్న కాంగ్రెస్, టిడిపిలు గతంలో అధికారంలో ఉన్నప్పుడూ ఈ పనులన్నీ ఎందుకు చేయలేదు? ఒంటరి మహిళలు, భోధకాలు రోగుల కష్టాల గురించి కనీసం ఆలోచన చేయలేకపోయారు. 50 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయనప్పుడు ఇప్పుడు చేస్తారని నమ్మకం ఏమిటి?
కనుక అటువంటి స్వార్ధరాజకీయ పార్టీలకు మీ ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పండి. మనకు తెలివి తేటలులేవు.. పరిపాలించుకోవడం రాదు... తెలంగాణ ఏర్పడితే కరెంటు ఉండదు...శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి... అంటూ మనల్ని అవహేళన చేసినవారే ఇప్పుడు మనం అన్ని రంగాలలో సాధించిన ప్రగతిని చూసి శభాష్ అని మెచ్చుకొంటున్నారు. ఇప్పుడిపుడే మనం మన రాష్ట్రాన్ని అందమైన పూలతో నిండిన పొదరిల్లులా మలుచుకొంటున్నాము. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మహాకూటమి చేతిలో పెడితే తెలంగాణ ఏర్పడక మునుపునాటి పరిస్థితులు పునరావృతం అవుతాయి. కనుక తెలంగాణ అభివృద్ధికి, మీ సంక్షేమం కోసం పనిచేసే తెరాసకే ఓటేసి గెలిపించమని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.