మహాకూటమిలో మొదటి మంత్రి పేరు ఖరారు!

మహాకూటమిలో టిడిపి అభ్యర్ధిగా కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తున్న సుహాసినికి మద్దతుగా శనివారం కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వే సత్యనారాయణ, టిడిపి సీనియర్ నేత పెద్దిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సర్వే సత్యనారాయణ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మహాకూటమి అధికారంలోకి వస్తే సుహాసినికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాము. ఆమె మంత్రి అయితే కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రజలకు చాలా మేలు కలుగుతుంది. కనుక ఆమెకే అందరూ ఓటు వేసి గెలిపించాలి,” అని కోరారు.

సుహాసిని మాట్లాడుతూ, “రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించాలంటే తెరాసను చిత్తుచిత్తుగా ఓడించాలి. నన్ను గెలిపిస్తే ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను,” అని అన్నారు. 

మహాకూటమిలో పేరాచూట్ అభ్యర్ధులలో సుహాసిని కూడా ఒకరు. ఇంతవరకు ఎవరికీ కనబడని ఆమె ఇప్పుడు హటాత్తుగా పసుపు కండువాతో ప్రజల ముందు ప్రత్యక్షమయ్యి ప్రజలకు సేవ చేయడం గురించే వచ్చానని చెప్పడం, రాక్షసపాలన అంతమొందించాలని కోరడం చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. పైగా కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన ఆమెను గెలిపిస్తే మంత్రి పదవి పొందుతారని సర్వే సత్యనారాయణ ప్రకటించడం ఇంకా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే, టికెట్ల విషయంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు ఏవిధంగా పోటీలు పడ్డారో అందరూ చూశారు. కనుక ఒకవేళ మహాకూటమి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే మొట్టమొదట ముఖ్యమంత్రి పదవి కోసం, ఆ తరువాత మంత్రి పదవుల కోసం నాలుగు పార్టీలలో పోటీ మొదలవుతుంది. మహాకూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీలో, అలాగే టిడిపిలోనే అనేకమంది సీనియర్లు మంత్రిపదవుల కోసం క్యూలో ఉన్నారు. వారిని కాదని రాజకీయాలలోకి కొత్తగా వచ్చిన సుహాసినికి మంత్రి పదవి ఇస్తారా? అంటే అనుమానమే. అయినా ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఈసారి ఎన్నికలలో ఏ పార్టీ, ఏ కూటమి గెలుస్తుందో తెలియక ముందే మహాకూటమిలో కాబోయే మంత్రుల పేర్లు ప్రకటిస్తుండటం విశేషం.