
మహాకూటమిలో టిడిపి అభ్యర్ధిగా ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేస్తున్న సామ రంగారెడ్డిపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఆయన తన వద్ద రూ.40 కోట్లు అప్పు తీసుకొన్నాడని, కానీ ఎన్నిసార్లు అడిగినా తిరిగి చెల్లించడంలేదని లక్ష్మారెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన పిర్యాదుపై స్పందించిన నాంపల్లి పోలీసులు సామ రంగారెడ్డిపై కేసు నమోదు చేసారు. అయితే ఎన్నికల సమయంలో తనపై ఈవిధంగా బురద జల్లి అప్రదిష్ట పాలుచేసి తనను దెబ్బ తీసేందుకే తన ప్రత్యర్ధులు ఈవిధంగా చేస్తున్నారని సామ రంగారెడ్డి అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.
ఇబ్రహీంపట్నంలో మహాకూటమి నుంచి కాంగ్రెస్, టిడిపి అభ్యర్డులు పోటీ పడుతుండటం విశేషం. కాంగ్రెస్ అభ్యర్ధిగా మల్ రెడ్డి రంగారెడ్డి, టిడిపి అభ్యర్ధిగా సామ రంగారెడ్డి, తెరాస అభ్యర్ధిగా ఎం. కిషన్ రెడ్డి, బిజెపి అభ్యర్ధిగా కె. అశోక్ గౌడ్ పోటీ చేస్తున్నారు. ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్ధులు మరింత ఉదృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. అయితే పోటీ ప్రధానంగా కాంగ్రెస్, తెరాసల మద్యే ఉంటుందని స్పష్టం అవుతోంది.