తెరాస బాటలోనే టి-బిజెపి?

మహాకూటమి ఏర్పాటు అసలు ఉద్దేశ్యాలు…చంద్రబాబు నాయుడు కుటిలయత్నాల గురించి తెరాస నేతలు గత రెండున్నర నెలలుగా చెపుతూనే ఉన్నారు. రాష్ట్రంలో బిజెపి కూడా 119 స్థానాలకు పోటీ చేస్తోంది. కనుక దానికి కూడా మహాకూటమి... దాని వెనుకున్న చంద్రబాబు నాయుడుని శత్రువులుగానే పరిగణించడం సహజమే. కానీ మహాకూటమి గురించి తెరాస నేతలు చెపుతున్న మాటలనే యదాతధంగా చెప్పుకోవడమే ఆశ్చర్యకరం. 

ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ అభివృద్ధికి, ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న చంద్రబాబు నాయుడు మహాకూటమి ముసుగులో మళ్ళీ తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులను ఆపివేయాలని కోరుతూ కేంద్రానికి అనేక లేఖలు వ్రాశారు. డిల్లీ, బెంగళూరులో కాంగ్రెస్‌ నేతలతో సమావేశమవుతూ తెలంగాణ ఎన్నికల ఫలితాలను మహాకూటమి ద్వారా శాసించాలని చంద్రబాబు కలలు కంటున్నారు. కానీ అది సాధ్యం కాదని ఆయనకు కూడా తెలుసు. ఆయన లేని తెలంగాణ రాష్ట్రం, ఆయన లేని రాజకీయాలు మనకు కావాలి. తెలంగాణ ప్రజలు ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పాలి. 

ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మొహం చూపించలేకనే టిడిపి, తెలంగాణ జనసమితి, సిపిఐలతో చేతులు కలిపి మహాకూటమి పేరుతో ప్రజల ముందుకు వస్తోంది. మేము మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని తెలిసి ఉన్నప్పటికీ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి తెరాస వారిని మోసం చేస్తోంది. ముస్లింలకు రిజర్వేషన్లు సాధ్యం కాదని కేసీఆర్‌కు బాగా తెలుసు గనుకనే దానిని గిరిజనుల రిజర్వేషన్లతో ముడిపెట్టారు. రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలకు, జాతీయవాద రాజకీయాలకు మధ్య సాగుతున్న యుద్దం ఈ ఎన్నికలు. ఈ యుద్దంలో మేమే గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం,” అని అన్నారు.