ఏపీలో బాబుకు ఓటమి తప్పదు: హరీష్

మేడ్చల్ సభలో నిన్న  కాంగ్రెస్‌ నేతలు మూకుమ్మడిగా తెరాస పాలనపై, సిఎం కేసీఆర్‌పై విమర్శలు చేయడంతో తెరాస నేతలు కూడా ధీటుగా స్పందిస్తున్నారు. మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమ వల్లనే నష్టపోయిందని నిన్న కాంగ్రెస్‌ నేతలే స్వయంగా చెప్పుకొన్నారు. ఇప్పుడు తెలంగాణకు కూడా అన్యాయం చేయడానికి వచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు తెలంగాణలో మహాకూటమి తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి వస్తారని చెప్పుతున్నారు. ఆయనకు తన స్వంత రాష్ట్రంలోనే ఎవరూ పట్టించుకోనప్పుడు తెలంగాణ ప్రజలు ఎందుకు పట్టించుకొంటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో టిడిపి ఓటమి ఖాయం. ఇక తెలంగాణలో ఏమి గెలిపిస్తారు? కాంగ్రెస్‌, టిడిపిలు చేతులు కలిపినా తెరాసకు వచ్చే నష్టం ఏమీ లేదు. తెరాస చేతిలో మహాకూటమి ఓటమి ఖాయం,” అని అన్నారు. 

 ఏపీలో నేటికీ టిడిపి బలంగాణే ఉన్నప్పటికీ, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా నానాటికీ బలం పుంజుకొంటున్నారు. పైగా ఆయన వెనుక బిజెపి ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈసారి తానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతానని నమ్మకంగా చెపుతున్నారు. ఆయన అధికారంలోకి రాలేకపోయినా టిడిపి, వైకాపాల ఓట్లు తప్పకుండా చీల్చి వాటికి నష్టం కలిగించడం ఖాయం. తాజాగా జెడి లక్ష్మీనారాయణ కూడా కొత్త పార్టీతో ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కనుక ఆయన కూడా కొన్ని ఓట్లు చీల్చడం ఖాయం. ఇక బిజెపి, సిపిఎం తదితర పార్టీలు బరిలో ఉందనే ఉంటాయి. ఈ లెక్కన వచ్చే ఎన్నికలలో ఏపీలో టిడిపి విజయం సాధించడం అంత తేలిక కాదని అర్ధమవుతోంది. కనుక చంద్రబాబు నాయుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు ఇప్పటి నుంచే టిడిపిని గెలిపించుకోవడానికి సన్నాహాలు చేసుకొంటే మంచిదేమో?