
మంత్రి కేటిఆర్ బుదవారం రేవంత్‌రెడ్డి ఇలాఖా కొడంగల్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహాకూటమి, దానిలో కాంగ్రెస్ పార్టీ, దాని కొడంగల్ అభ్యర్ధి రేవంత్‌రెడ్డిపై సునిశితమైన విమర్శలు చేశారు.
రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గం అభివృద్ధి కోసం చేసిందేమీ లేకపోయినా కొడంగల్‌కు తాను మాత్రమే దిక్కు అన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. సిఎం కేసీఆర్‌పై విమర్శలు, అసత్య ఆరోపణలు చేసినంతమాత్రన్న రాజకీయాలలో రేవంత్‌రెడ్డి స్థాయి పెరిగిపోదని అన్నారు. తెరాస అధికారంలోకి రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకొంటాను. మహాకూటమి రాకపోతే రేవంత్‌రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకొంటారా? అని కేటిఆర్ సవాలు విసిరారు.
తెరాసకు ఒకే ఒక ముఖ్యమంత్రి అభ్యర్ధి కేసీఆర్ ఉన్నారని కానీ కాంగ్రెస్ పార్టీకి కనీసం 40 మందికి పైగా ముఖ్యమంత్రి అభ్యర్ధులున్నారని, డిల్లీ నుంచి సీల్డ్ కవరు వస్తే గానీ వారిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో వారికే తెలియదని కేటిఆర్ ఎద్దేవా చేశారు. పొరపాటున రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నెలకొని మళ్ళీ ఆనాటి పరిస్థితులు పునరావృతం అవుతాయని మంత్రి కేటిఆర్ ప్రజలను హెచ్చరించారు.
కాంగ్రెస్, టిడిపిలు కరెంటు అడిగిన ప్రజలను, రైతులను పోలీసులతో కొట్టించాయని, అదే... తెరాస ప్రభుత్వం ఎవరు నోరు తెరిచి అడగకుండానే రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు అందిస్తోందని అన్నారు. కనుక ఉచిత కరెంటు కావాలో లేక మళ్ళీ కరెంటు కోతలు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న 10-12 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని కేటిఆర్ హామీ ఇచ్చారు. అలాగే వృద్ధులకు పెన్షన్ వయో పరిమితిని 62 నుంచి 58కి తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఒకేసారి లక్ష రూపాయలు పంటరుణాలమాఫీ, వికలాంగులు, ఒంటరిమహిళలు, బోధకాలు వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ తమ నాలుగేళ్ళ పాలనలో రాష్ట్రంలో జరిగిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించి అవన్నీ నిరవధికంగా కొనసాగాలంటే తెరాసకు ఓట్లు వేసి మళ్ళీ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.