ఇంకా రెండువారాలే మిగిలుంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి కేవలం రెండువారాలు మాత్రమే సమయం మిగిలుందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన నిన్న పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ప్రస్తుతం కేసీఆర్‌ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండువారాల తరువాత ఆయన శాస్వితంగా మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కనుక కీలకమైన ఈ రెండు వారాలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే, డిసెంబరు 12న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. దాంతో రాష్ట్ర ప్రజల కష్టాలు, కాంగ్రెస్‌ కార్యకర్తల కష్టాలు అన్ని తీరిపోతాయి. శుక్రవారం సాయంత్రం మేడ్చల్ పట్టణంలో జరుగబోయే బహిరంగసభలో పాల్గొనడానికి మన పార్టీ అధినేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ రాబోతున్నారు. కనుక వారికి ఘనంగా స్వాగతం పలికి సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్ట మొదటిసారిగా సోనియాగాంధీ రాష్ట్రానికి వస్తున్నారు. కనుక అన్ని జిల్లాల నుంచి లక్షలాది మందిగా కార్యకర్తలు తరలివచ్చి ఈ బహిరంగసభను విజయవంతం చేయాలి,” అని కోరారు. 

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇరువురూ ప్రత్యేక విమానంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన్న మేడ్చల్ చేరుకొని బహిరంగసభలో పాల్గొంటారు. సభ ముగిసిన తరువాత మళ్ళీ బేగంపేట నుంచి విమానంలో డిల్లీ తిరిగి వెళ్లిపోతారు. ఈ సభకు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌, సిపిఐ, టిడిపి ముఖ్య నేతలు హాజరుకాబోతున్నట్లు సమాచారం.