ఎల్లుండి నుంచే ఓటరు స్లిప్పులు పంపిణీ!

చూస్తూ చూస్తూ ఉండగానే అనూహ్యంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చేశాయి. మొన్నటితో నామినేషన్ల పర్వం ముగియడంతో ఎల్లుండి నుంచి రాష్ట్రంలో ఓటర్లకు ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం మొదలుపెడతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ చెప్పారు. ఎల్లుండి నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు ఓటరు స్లిప్పుల పంపిణీ చేస్తామని చెప్పారు.

తాజాగా ఖరారు చేసిన ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 7,45,838 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకొన్నారని చెప్పారు. అలాగే 243 మంది ప్రవాసులు కొత్తగా ఓటర్లుగా నమోదు అయ్యారని చెప్పారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ఎన్నికల అధికారులకు ఈ ఓటరు స్లిప్పులను అందజేస్తున్నామని, వాటిని బూత్ లెవెల్ అధికారులు స్వయంగా ఇంటింటికీ వెళ్ళి ఓటర్లకు అందజేయాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా వాటిని రాజకీయ పార్టీల చేతికి ఇచ్చినట్లయితే వారిపై కటినమైన చర్యలు తీసుకొంటామని రజత్‌కుమార్‌ హెచ్చరించారు. ఈసారి ఓటరు స్లిప్పుల వెనుకభాగంలో పోలింగ్ బూత్ వివరాలు, అది ఉన్న ప్రాంతం మ్యాప్ ముద్రించినట్లు తెలిపారు. కనుక వాటి ఆధారంగా సులువుగా పోలింగ్ బూత్ చేరుకోవచ్చునని రజత్‌కుమార్‌ చెప్పారు. 

డిసెంబరు 5వ తేదీ సాయంత్రం 5 గంటలతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తుంది. డిసెంబరు 7వ తేదీ ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. డిసెంబరు 11వ తేదీన ఓట్లు లెక్కింపు చేసి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.