క్రిశాంక్ ఆవేదన సహేతుకమే

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా టికెట్ సంపాదించుకొన్న సర్వే సత్యనారాయణపై స్వయాన్న ఆయన అల్లుడు క్రిశాంక్ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన తనను ‘బచ్చాగాడు’ అంటూ టికెట్ నిరాకరించడాన్ని క్రిశాంక్ తప్పు పడుతున్నారు. 

ఆయన ఇవాళ్ళ మీడియాతో మాట్లాడుతూ, “ఒక రాజకీయ నాయకుడు రాజకీయాలు చేస్తే వాటితో అతను పైకి ఎదుగుతాడు. కానీ ఒక విద్యార్ధి చదువులు పక్కన పెట్టి తెలంగాణ కోసం పోరాడితే చివరికి ఏమవుతుందో తెలుసుకోవాలంటే దానికి నేనే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తాను. తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్న రాజకీయనాయకులకు పదవులు లభించాయి. ఉద్యోగులకు జీతాలు పెరిగాయి. కానీ తెలంగాణ కోసం బలిదానాలు చేసుకొన్న మా విద్యార్ధులకు ఏమి మిగిలాయి? అంటే కోర్టు కేసులు మాత్రమే కనిపిస్తాయి. 

మా జీవితాలను పణంగా పెట్టి పోరాడింది ఇందుకేనా?యువత రాజకీయాలలోకి రావాలంటారు. కానీ వస్తే ఆదరించరు. టికెట్ ఇవ్వరు. టికెట్ అడిగితే బచ్చాగాడివంటారు. కానీ ఇదే బచ్చాగాడు గత ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ తరపున బిజెపి, తెరాస నేతలతో, జాతీయ మీడియాతో కూడా వాదించాడు. అప్పుడు శభాష్ అని మెచ్చుకొన్న నాయకులకు ఇప్పుడు నేను టికెట్ ఇచ్చేందుకు అనర్హుడిగా కనిపిస్తున్నానా? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం నా చదువులు, ఉద్యోగం అన్ని వదులుకొని రేయింబవళ్లు పనిచేశాను. నాకు యూనివర్సిటీలో విద్యార్ధుల, నా నియోజకవర్గంలో ప్రజల మద్దతు ఉంది కానీ మా పార్టీ పెద్దలు అవేమీ చూడలేదు. కాంగ్రెస్ పార్టీలో ‘గాడ్ ఫాదర్’ లేనివాళ్ళకు ఎటువంటి గుర్తింపు, ప్రాధాన్యత ఉండదని మరోసారి నిరూపితమైంది. 

డబ్బు, పలుకుబడి ఉన్నవారైతే తప్పకుండా గెలుస్తారంటే మరి సర్వే సత్యనారాయణ గారు ఎందుకు అన్నిసార్లు ఎన్నికలలో ఓడిపోయారు?క్రిందటిసారి ఎన్నికలప్పుడు నాకు టికెట్ ఇస్తామని కాంగ్రెస్‌ పెద్దలు హామీ ఇచ్చారు. కానీ ఇవ్వలేదు. అయినా నేను రేయింబవళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాను. ఈ ఐదేళ్లలో పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి వ్యక్తిగతంగా అనేక త్యాగాలు చేశాను. చివరికి నా ఇల్లు కూడా అమ్మేసుకొన్నాను. 

ఇప్పుడు టికెట్ రాకపోతే 2024కి టికెట్ వస్తుందనే నమ్మకం లేదు. అయినా అంతవరకు నేను రాజకీయంగా మనుగడ సాగించగలనని భావించడం లేదు. ఇప్పటికే నేను నా గుర్తింపును కోల్పోయి ‘సర్వే సత్యనారాయణగారి అల్లుడు’గా మిగిలిపోయాను. అది నాకిష్టం లేదు. నా ఉనికిని, నా ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడం కోసం నేను పోరాడుతాను. పోరాడకుండా ఓటమిని అంగీకరించడం కంటే పోరాడి ఓడిపోయినా పరువాలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను కంటోన్మెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తాను. ఇప్పుడు పోరాడలేకపోతే మరెప్పటికి నేను పోరాడలేను. కనుక ఇదే నా చివరిపోరాటం. ఈ పోరాటంలో నేను గెలిస్తే మీ అందరి ముందు ఉంటాను లేకుంటే మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాలలో కనిపించను,” అని క్రిశాంక్ చాలా ఆవేదనతో అన్నారు.