
మహాకూటమిలో కాంగ్రెస్-టిజేఎస్-సిపిఐ పార్టీల మద్య సీట్ల పంపకాల పంచాయితీ నేడు డిల్లీకి చేరింది. దీనిపై నేరుగా రాహుల్ గాంధీతోనే మాట్లాడి అమీతుమీ తేల్చుకొనేందుకు టిజేఎస్-సిపిఐ పార్టీల నేతలు నేడు డిల్లీ చేరుకొన్నారు. మూడు పార్టీల మద్య సీట్ల సర్దుబాట్లపై అంగీకారం కుదిరితే ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ అభ్యర్ధుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఒకపక్క మహాకూటమిలో మిత్రపక్షాలతో సీట్ల పంపకాలు చేసుకోలేక కాంగ్రెస్ పార్టీ తలపట్టుకొంటుంటే, మరోపక్క పార్టీలో ఆ స్థానాలను ఆశిస్తున్న అభ్యర్ధులు, వారి అనుచరులు అక్కడ డిల్లీలో, ఇక్కడ హైదరాబాద్‌లో గాంధీభవన్ వద్ద గత నాలుగు రోజులుగా నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు.
సీనియర్ కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ పశ్చిమ టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఆ స్థానాన్ని టిజేఎస్ కు కేటాయించబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు చూసి, గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, నియోజకవర్గంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న ఉదయం వరంగల్ కాంగ్రెస్ కార్యాలయంలోకి ప్రవేశించి తలుపులు వేసుకొని లోపలే ఉంటూ నిరసన దీక్షలు మొదలుపెట్టారు. అనేక ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాయిని రాజేందర్ రెడ్డిని కాదని టిజేఎస్ అభ్యర్ధికి టికెట్ కేటాయిస్తే సహించబొమని వారు పార్టీని హెచ్చరిస్తున్నారు.
ఇక మల్కాజ్ గిరి టికెట్ కోసం నందికంటి శ్రీధర్, ఖానాపూర్ టికెట్ కోసం హరినాయక్, వేములవాడ టికెట్ ఇవ్వాలని కోరుతూ ఏనుగు మనోహర్ రెడ్డి అనుచరులు గాంధీ భవన్ వద్ద నిరాహార దీక్షలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ టికెట్ తనకే కేటాయించాలని మారేపట్టి సురేందర్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క డిల్లీలో కూడా ఆశావాహులు ధర్నాలు చేస్తున్నారు. స్టేషన్ స్టేషన్ ఘన్‌పూర్ పూర్ టికెట్ ఆశిస్తున్న విజయరామారావు డిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. ఆయనతో బాటు మరికొందరు ఆశావాహులు కూడా నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. ఒకపక్క మహాకూటమిలో మిత్రపక్షాలతో సీట్ల పంపకాల వ్యవహారాన్ని తేల్చుకొంటూనే మరోపక్క సీనియర్ కాంగ్రెస్ నేతల ద్వారా టికెట్ కోసం ఆందోళనలు చేస్తున్నవారిని కాంగ్రెస్ పార్టీ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది.