కేసీఆర్‌ బహిరంగసభలు తగ్గించుకొన్నారెందుకో?

గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలలో సిఎం కేసీఆర్‌ చాలా నిశ్చింతగా కనిపిస్తున్నారు. గత ఎన్నికలలో మెదక్ (ఎంపీ), గజ్వేల్ (శాసనసభ) స్థానాలకు పోటీ చేయగా ఈసారి గజ్వేల్ నుంచి మాత్రమే పోటీ చేస్తున్నారు. అయితే ఇంతవరకు తన నియోజకవర్గంలో ఆయన ఒక్క బహిరంగసభ కూడా నిర్వహించలేదు. మంత్రి హరీష్ రావు ఆయన తరపున గజ్వేల్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సిఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌ నుంచి కాలు బయట పెట్టకుండానే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో తెరాస ఎన్నికల ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.       

ఇక సెప్టెంబరు 6వ తేదీన శాసనసభను రద్దు చేసినప్పుడు రోజుకు రెండు చొప్పున 50 రోజులలో 100 బహిరంగసభలు నిర్వహిస్తానని సిఎం కేసీఆర్‌ చెప్పారు. కానీ ఇప్పటి వరకు కేవలం 5 బహిరంగసభలు మాత్రమే నిర్వహించారు. తెరాస అభ్యర్ధులకు నిన్న తెలంగాణభవన్‌లో బి-ఫారంలు అందజేసినప్పుడు తాను 70-80 బహిరంగసభలలో పాల్గొంటానని చెప్పారు. అంటే సిఎం కేసీఆర్‌ ఈసారి బహిరంగసభల సంఖ్యను కూడా బాగా తగ్గించుకొనట్లు అర్ధమవుతోంది. 

గత నాలుగేళ్ళలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలే తమను తప్పకుండా గెలిపిస్తాయనే నమ్మకమే కేసీఆర్‌ ధీమాకు కారణం అయ్యుండవచ్చు. తెరాస అభ్యర్ధులలో కూడా ఈ ధీమా నమ్మకం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికలలో తెరాస 100కుపైగా సీట్లు గెలుచుకొంటుందని కేసీఆర్‌ నిన్న కూడా పునరుద్ఘాటించారు. అదీగాక మహాకూటమిలో నేటికీ సీట్ల పంపకాలు పూర్తవకపోవడంతో ఆ పార్టీల అగ్రనేతలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టలేదు. కనుక వారు కూడా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన తరువాతే సిఎం కేసీఆర్‌ కూడా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని ఎదురుచూస్తున్నారు.