
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మొదటిదశ పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభం అయ్యింది. ఇవాళ్ళ 18 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. మళ్ళీ నవంబరు 20వ తేదీన మిగిలిన 72 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇవాళ్ళ జరిగే పోలింగ్ లో మొత్తం 32 లక్షల మంది ఓటర్లు పాల్గొంటారు.
ఈరోజు పోలింగ్ జరుగబోయే 12 నియోజకవర్గాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో ఉన్నందున 900 మంది పోలింగు సిబ్బందిని హెలికాప్టర్లలో పోలింగ్ బూతులకు చేర్చారు. సుమారు 16,500 మంది భద్రతాదళాలను మోహరించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైన భద్రతదళాలను తరలించేందుకు ఆరు హెలికాప్టర్లను సిద్దంగా ఉంచారు. 18 నియోజకవర్గాలలో డ్రోన్ కెమెరాలతో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఇంత బందోబస్తు చేసినప్పటికీ ఈరోజు తెల్లవారుజామున దంతేవాడ నియోజకవర్గంలో ఎన్నికలు బహిష్కరించాలని ప్రజలను హెచ్చరిస్తూ మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. పోలింగ్ మొదలైన కొద్ది సేపటికే దంతేవాడ నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూతుకు సమీపంలో మావోయిస్టులు బాంబు ప్రేలుళ్ళకు పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. భద్రతాదళాలు పరిసర ప్రాంతాలలో తనికీలు నిర్వహించిన తరువాత మళ్ళీ పోలింగ్ మొదలైంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుంది.