ఈటల నన్ను మోసం చేశారు అందుకే... మల్లేశ్ యాదవ్

మంత్రి ఈటల రాజేందర్ వద్ద గతంలో కారు డ్రైవరుగా పనిచేసిన మేకల మల్లేశ్ యాదవ్ అనే వ్యక్తి ఈటలపై తీవ్ర ఆరోపణలు చేశారు. మల్లేశ్ యాదవ్ శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్బులో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “నేను చాలా కాలంపాటు ఈటల కారు డ్రైవరుగా పనిచేశాను. ఉద్యమ సమయంలో అసెంబ్లీలో జరిగిన ఘటనలో 45 రోజుల పాటు జైలు జీవితం గడిపినందుకు నా ఉద్యోగం పోయింది. అప్పుడు ఉద్యమాలకు మద్దతు పలుకుతున్న కొంతమంది పెద్దలందరూ కలిసి నా కుటుంబపోషణకు రూ.30 లక్షలు విరాళంగా అందించారు. కానీ దానిని ఈటల రాజేందర్ తీసేసుకొన్నారు. ఆ డబ్బు నాకు ఇవ్వలేదు కనీసం ప్రభుత్వోద్యోగం కల్పించకపోవడంతో నా కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. అప్పటి నుంచి నా కుటుంబాన్ని పోషించుకోవడానికి కూలిపనికి వెళుతున్నాను. తెలంగాణ సాధన కోసం పొరాడి జైలుకు వెళ్ళిన నావంటివారు ఎందరో నాలాగే దరిద్రం అనుభవిస్తున్నారు. మాకు ఈటల రాజేందర్, ఆయన అనుచరులు చాలా అన్యాయం చేశారు. అందుకే ఈసారి ఎన్నికలలో నేను ఈటల రాజేందర్‌పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకొంటున్నాను,” అని చెప్పారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.