
బిఎల్ఎఫ్ అభ్యర్ధిగా ఆలేరు నుంచి పోటీ చేస్తున్న మోత్కుపల్లి నర్సింహులు ఈనెల 17న నామినేషన్ పత్రాలు దాఖలు చేయబోతున్నట్లు ప్రకటించారు. తాను ప్రజల కోరిక మేరకే పోటీ చేస్తునందున తన నామినేషన్ దాఖలు కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తనకు మద్దతు తెలుపాలని విజ్ఞప్తి చేశారు. తాను ఇదివరకే నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపానని, మళ్ళీ ఇప్పుడు తనను గెలిపిస్తే నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకువచ్చి ప్రజల పాదాలు కడిగి రుణం తీర్చుకొంటానని చెప్పారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలు తన పట్ల చూపుతున్న ఆధరణను చూస్తుంటే భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమనే నమ్మకం కలుగుతోందని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.
మోత్కుపల్లి నర్సింహులు రాజకీయాలలో చాలా సీనియర్ నాయకుడే. అయితే గత నాలుగైదేళ్ళుగా వేసిన కొన్ని వరుస తప్పటడుగులు వలన రాజకీయాలలో వెనుకబడిపోయారని చెప్పక తప్పదు. చంద్రబాబు మాట నమ్మి గవర్నర్ పదవి కోసం ఎదురుచూపులు చూస్తూ సుమారు నాలుగైదేళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండటం మొదటి తప్పు. గవర్నర్ పదవి రాదని గ్రహించిన తరువాత టిడిపిలో చురుకుగా వ్యవహరించకుండా, దానిని తెరాసలో విలీనం చేయాలని చెప్పడం రెండవ తప్పు. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తానని చెపుతూ తన సేవలను ఉపయోగించుకోవాలని సిఎం కేసీఆర్‌ను కోరడం మూడో తప్పు.
అదే ఆయన గత నాలుగైదేళ్ళుగా రాజకీయాలలో చురుకుగా ఉండి ఉంటే నేడు ఆయన పరిస్థితి వేరే విధంగా ఉండేది. లేదా ఇదివరకులాగే టిడిపికి అనుకూలంగా వ్యవహరించి ఉండి ఉంటే నేడు సాధికారికంగా టికెట్ డిమాండ్ చేసి తీసుకోగలిగి ఉండేవారు. పైగా ఆయనకు మహాకూటమి అండదండలు లభించి ఉండేవి. ఇవే తన చివరి ఎన్నికలని కనుక తనను గెలిపించమని ఒకపక్క ఆలేరు ప్రజలను బ్రతిమలాడుకొంటూ, తన సేవలను కేసీఆర్ ఉపయోగించుకొంటే జిల్లాలో అన్ని స్థానాలలో తెరాస అభ్యర్ధులను గెలిపిస్తానని మోత్కుపల్లి చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది.
అయితే ఆయన అదృష్టం కొద్దీ బిఎల్ఎఫ్ తరపున పోటీ చేసేందుకు అవకాశం లభించింది. కనుక బిఎల్ఎఫ్ లో సిపిఎం తదితర పార్టీల మద్దతుతో గట్టిగా ప్రయత్నించుకొంటే మంచిది.