గాంధీ భవన్‌ వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తల నిరసనలు

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసి, రేపు ప్రకటించబోతున్నామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రామచంద్ర కుంతియా గురువారం ప్రకటించడంతో, టికెట్ ఆశిస్తున్న ఆశావాహులలో ఆందోళన పెరిగిపోయింది. మహాకూటమిలో సీట్లసర్దుబాట్లలో భాగంగా మల్కాజ్ గిరి సీటును టిజేఎస్కు కేటాయిస్తారని మీడియాలో వార్తలు రావడంతో అక్కడి నుంచి పోటీ చేయాలనుకొంటున్న కాంగ్రెస్‌ నేత శ్రీధర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఈరోజు ఆయన అనుచరులు హైదరాబాద్‌లో గాంధీ భవన్‌ ముట్టడించి తమ నాయకుడికే తప్పనిసరిగా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీధర్ గత 10 ఏళ్లుగా మల్కాజ్ గిరిలో ప్రజల మద్య ఉంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేశారని, ప్రజలతో సత్సంబంధాలున్నందున మంచి ప్రజాధారణ కలిగి ఉన్నారని, కనుక ఆయనకు టికెట్ కేటాయించినట్లయితే భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని ఆయన అనుచరులు మీడియాకు తెలిపారు. ఒకవేళ ఆయనకు టికెట్ ఇవ్వకుండా టిజేఎస్ లేదా మరే పార్టీ అభ్యర్ధికి టికెట్ కేటాయించినా వారిని తామే తప్పకుండా ఓడిస్తామని హెచ్చరించారు. మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటిదని దానిని పొత్తులలలో భాగంగా టిజేఎస్ కు కేటాయించాలనుకోవడం అవివేకమని వారు అన్నారు. కనీసం క్యాడర్ కూడా లేని టిజేఎస్ కు ఆ సీటు ఎందుకని వారు ప్రశ్నించారు. టిజేఎస్ కు మల్కాజ్ గిరి సీటు కేటాయిస్తే, కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవలసిన ఆ స్థానాన్ని తెరాస ఎగురవేసుకువెళ్ళి పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మహాకూటమిలో మిత్రపక్షాలతో సీట్ల పంపకాల వ్యవహారం ముగించలేక చాలా ఇబ్బంది పడుతోంది. ఇప్పుడు పార్టీలో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. మొన్న శేరిలింగంపల్లి టికెట్ కోసం భిక్షపతి యాదవ్ అనుచరులు, నేడు శ్రీధర్ అనుచరులు ఏకంగా గాంధీ భవన్ వద్దే నిరసనలు తెలియజేశారు. రేపు కాంగ్రెస్ అభ్యర్ధుల పేర్లు ప్రకటించిన తరువాత ఈ అసంతృప్తి సెగలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. కనుక కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద అగ్నిపరీక్ష సిద్దంగా ఉందని చెప్పవచ్చు.