హైదరాబాద్‌లో అర్దరాత్రి లగడపాటి హడావుడి

మాజీ కాంగ్రెస్‌ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురువారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 65లో తన స్నేహితుడు జీపీ రెడ్డి నివాసంలో హడావుడి చేశారు. నిన్న రాత్రి సుమారు 10 గంటలకు వెస్ట్ జోన్ డిసిపి ఏఆర్ శ్రీనివాస్ కొంతమంది పోలీసులను వెంటబెట్టుకొని జీపీ రెడ్డి నివాసంలో తనికీలు చేయడానికి వచ్చారు. ఈ సంగతి తెలుసుకొన్న లగడపాటి రాజగోపాల్ హుటాహుటిన అక్కడికి చేరుకొని డిసిపి శ్రీనివాస్ ను అడ్డుకొన్నారు. ఎటువంటి వారెంటు లేకుండా రాత్రిపూట తన స్నేహితుడి ఇంటిని తనికీ చేయడానికి ఎందుకు వచ్చారని గట్టిగా నిలదీశారు. వెంటనే ఆయన ఫోన్లో పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఐజీ నాగిరెడ్డి, వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ ఇద్దరూ కలిసి తన స్నేహితుడిని ఉద్దేశ్యపూర్వకంగానే వేధిస్తున్నారని ఆరోపించారు. మళ్ళీ ఇటువంటి పనులకు పూనుకొంటే ఎన్నికల సంఘానికి, గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. 

అనంతరం లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతూ, “నా స్నేహితుడు గత 4 ఏళ్ళ నుంచి ఇదే ఇంటిలో ఉంటున్నారు. ఆయన ఉంటున్న ఇంటి స్థలానికి తప్పుడు దృవపత్రాలు సృష్టించి ఇల్లు నిర్మించుకొన్నారంటూ ఐజీ నాగిరెడ్డి ఆయనను వేధిస్తున్నారు. ఈ కేసు విచారణకు నా స్నేహితుడు ఇప్పటి వరకు ఓ 20 సార్లు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఆయనను ఈవిధంగా వేధిస్తున్నారు. ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండికదా అని పోలీసులు రెచ్చిపోతే మమ్మల్ని మేము కాపాడుకొనేందుకు చట్టం న్యాయవ్యవస్థలు ఉన్నాయి,” అని అన్నారు.