19.jpg)
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ మొదలుపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం జనవరి మొదటివారంలో నోటిఫికేషన్ జారీ చేస్తామని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. హైకోర్టు విభజనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పాల్గొన్న న్యాయవాది ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీనాటికి అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణం పూర్తవుతుందని, ఫిబ్రవరి-మార్చిలోగా హైకోర్టు న్యాయమూర్తులు, ఉద్యోగుల నివాస సముదాయాలు సిద్దం అవుతాయని తెలిపారు. అమరావతిలో ‘జస్టిస్ సిటీ’ పేరుతో ఏకంగా ఒక చిన్న పట్టణాన్నే నిర్మిస్తున్నామని, దానిలో హైకోర్టు శాశ్విత భవనసముదాయాలు, నివాస సముదాయాలు ఉంటాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ వివరణతో సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం జనవరి 1వ తేదీ నుంచి అమరావతిలో హైకోర్టులో కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పనుల పురోగతిని బట్టి నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపింది. ఈ నిర్మాణకార్యక్రమాలలో మరి కాస్త ఆలస్యం అయినా వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలలోగా ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయి.