ఎన్నికల కురుక్షేత్రంలో టిడిపి నేత అస్త్రసన్యాసం!

అలనాడు కురుక్షేత్ర యుద్దానికి ముందు అర్జునుడు అస్త్ర సన్యాసం చేస్తే ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టిటిడిపి అధినేత ఎల్ రమణ అస్త్ర సన్యాసం చేశారు. ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఈసారి ఎన్నికలలో పోటీ చేయకూడదని నిర్ణయించుకొన్నాను. మహాకూటమిలో కాంగ్రెస్‌ తరపున జగిత్యాల నుంచి పోటీ చేయబోతున్న నా మిత్రుడు జీవన్ రెడ్డికి పూర్తి మద్దతు తెలుపుతున్నాను. ఈసారి ఎన్నికలలో మహాకూటమిని గెలిపించుకొనేందుకు నేను ఎన్నికల ప్రచారానికే పరిమితమవుతాను,” అని చెప్పారు.

మహాకూటమిలో టిడిపికి సీట్ల పంపకాలపై కాంగ్రెస్ నేతలతో చర్చిస్తున్న ఎల్ రమణ హటాత్తుగా ఈ ప్రకటన చేయడం ఆశ్చర్యకరమే. అయితే రెండు మూడేళ్ళ క్రితమే ఫిరాయింపుల కారణంగా తెలంగాణలో టిడిపి బలహీనపడినప్పుడే ఆయన ఈ నిర్ణయం తీసుకొన్నారు. అప్పుడే తన నిర్ణయాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా తెలియజేశారు. కానీ అప్పుడు ఇది ప్రకటించవలసిన అవసరం లేనందున ప్రకటించలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేయి కనుక ప్రకటించక తప్పలేదు. అయితే టిటిడిపితో సహా అన్ని పార్టీలలో ఆశావాహులు టికెట్ల కోసం కీచులాడుకొంటుంటే అడగకుండానే టికెట్ పొందగలిగే అవకాశం ఉన్న ఎల్ రమణ టికెట్ వద్దనుకోవడం విశేషమేనని చెప్పవచ్చు.