
వికారాబాద్ పరిగి మండలం సుల్తాన్‌పూర్‌లో తెరాస నేత నారాయణ రెడ్డి మంగళవారం తెల్లవారుజామున దారుణహత్యకు గురయ్యారు. గతంలో ఆయన అనుచరులుగా ఉన్న కొందరు వ్యక్తులే ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. రోజూలాగే ఈరోజు తెల్లవారుజామున ఆయన తన పొలానికి వెళుతుండగా దారిలో కొందరు వ్యక్తులు కాపుకాసి తలపై కర్రలతో, బండరాళ్ళతో కొట్టి పారిపోయారు. తీవ్ర రక్తస్రావం కారణంగా నారాయణ రెడ్డి ఘటనా స్థలంలోనే చనిపోయారు.
నారాయణరెడ్డిపై దాడి చేసినవారు కాంగ్రెస్ పార్టీకి చెందినవారని గుర్తించడంతో ఆయన అనుచరులు గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్ళపై దాడులు చేశారు. ఈ సంగతి తెలుసుకొని భారీ సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకొని గ్రామంలో పరిస్థితులు అదుపు తప్పకుండా పహారా కాస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నారాయణ రెడ్డి శవాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. నారాయణ రెడ్డిని హత్య చేసిన వారికోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.