
తెరాస తాజా మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ పార్టీపై తిరుగుబాటుకు సిద్దం అవుతున్నారా? అంటే అవుననే ఆమె సంకేతాలు ఇస్తున్నారు. సిఎం కేసీఆర్ సెప్టెంబరు 6న ప్రకటించిన తొలిజాబితాలో చొప్పదండి ఎమ్మెల్యే బోడిగె శోభ పేరులేకపోవడంతో ఆమె షాక్ అయ్యారు. కానీ ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేయకుండా మళ్ళీ టికెట్ సంపాదించుకొనేందుకు తెర వెనుక గట్టి ప్రయత్నాలు చేసుకొంటున్నారు. కానీ తెరాస అధిష్టానం నుంచి ఆమెకు ఎటువంటి సానుకూల సంకేతాలు రాకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నారు. ఇదే సమయంలో తెరాస రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుంకే రవిశంకర్ ఈసారి చొప్పదండి నుంచి తాను పోటీ చేయబోతున్నానంటూ జోరుగా ఎన్నికల ప్రచారం చేసుకొంటుండటంతో బోడిగె శోభ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల నామినేషన్ వేయడానికి గడువు సమీపిస్తుండటంతో, ఆమె కూడా ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. ఆమె కులసంఘాల, వివిద వర్గాల నేతలతో సమావేశమవుతూ ఈసారి ఎన్నికలలో కూడా తనే పోటీ చేయబోతున్నానని కనుక తనకు తప్పకుండా మద్దతు తెలుపాలని కోరుతున్నారు. దీంతో చొప్పదండిలో తెరాస తరపున వారిరువురిలో ఎవరు పోటీ చేస్తారో తెలియక అటు ప్రజలు, తెరాస కార్యకర్తలు అయోమయపడుతున్నారు.
ఆమె నిన్న మీడియాతో మాట్లాడుతూ, “నాకు తెరాస టికెట్ లభించినా లభించకపోయినా మళ్ళీ నేనే పోటీ చేయాలని చొప్పదండిలో ప్రజలు కోరుకొంటున్నారు,” అని చెప్పారు. అంటే టికెట్ లభించకపోతే ప్రజల అభీష్టం మేరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆమె సిద్దం అవుతున్నట్లు సంకేతం ఇస్తున్నట్లుగానే భావించవచ్చు. సుంకే రవిశంకర్, బోడిగె శోభ ఇద్దరిలో తెరాస టికెట్ ఎవరికి దక్కుతుందో మరో వారంలోగా తేలిపోతుంది. అంతవరకు ఈ సస్పెన్స్ తప్పదు.