చిన్న గడ్డం, పెద్ద గడ్డం వస్తున్నాయి: నాయిని

రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదివారం ఆర్మూర్‌లో జరిగిన రజకుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసేందుకు పనిచేస్తున్న కాంగ్రెస్‌, టిడిపిలు మహాకూటమి రూపంలో మీ ముందుకు వస్తున్నాయి. వాటిలో ఒక చిన్న గడ్డం (చంద్రబాబు నాయుడు) ఒక పెద్ద గడ్డం (ఉత్తమ్ కుమార్ రెడ్డి) ఉన్నాయి. మన ప్రాజెక్టులను అడ్డుపడుతున్న వారినీ వారి పార్టీలను తిప్పికొట్టి వారి బారి నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలదే. ఒకప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డాడు. తెలంగాణ ఏర్పడిన తరువాత మన ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నాడు. మన రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న చంద్రబాబు నాయుడు, మహాకూటమి తరపున ఎన్నికల ప్రచారానికి వస్తానని చెపుతున్నారు. ఆయనకు మన రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కేలేదు. తమపార్టీయే తెలంగాణను ఇచ్చిందని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ నేతలు, తమ అధిష్టానం జాప్యం చేయడం వల్లే 1,200 మంది విద్యార్ధుల బలిదానాలు చేసుకొన్నారని ఒప్పుకొంటే బాగుండేది. కాంగ్రెస్‌నేతలకు ఎంతసేపు పదవులు, అధికారం కోసం తాపత్రాయమే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల సమస్యల గురించి ఏమాత్రం ఆలోచన లేదు. అందుకే వారు రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబు నాయుడుతో నిసిగ్గుగా చేతులు కలిపారు,” అని అన్నారు.

పదవులు, అధికారం కోసం ఒక్క కాంగ్రెస్‌ నేతలే కాదు...తెరాసతో సహా అన్ని పార్టీలు వాటి నేతలు ఆరాటపడుతూనే ఉంటారు. అన్ని పార్టీలలో టికెట్ల కోసం జరుగుతున్న కీచులాటలే అందుకు తాజా ఉదాహరణలు. తెరాస ప్రభుత్వానికి మరో 8-9 నెలలు పాలించే అవకాశం ఉన్నప్పటికీ, ఎటువంటి కారణాలు చూపకుండానే ఇంత ముందుగా ఎన్నికలకు ఎందుకు వెళుతోందంటే, పరిస్థితులన్నీ తమకు అనుకూలంగా ఉన్నప్పుడే ఎన్నికలకు వెళితే మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలనే ఆలోచనతోనే!తెరాసకు ఇంత అధికారయావ ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీని వేలెత్తి చూపడం హాస్యాస్పదంగా ఉంది. ఇక మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో దెబ్బ తీసేందుకే తెరాస నేతలు చంద్రబాబు నాయుడును బూచిగా చూపిస్తున్నారని చెప్పవచ్చు. తెరాస ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో డిసెంబరు 11వ తేదీన తేలిపోతుంది.