మహాకూటమికి నేడు సెమీ ఫైనల్స్?

కాంగ్రెస్, టిడిపిలు 109 సీట్లు పంచుకొన్నట్లు ప్రకటించిన తరువాత తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ నిన్న డిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యి మహాకూటమి గురించి చర్చించిన సంగతి తెలిసిందే. టిజేఎస్ కు 17 సీట్లు ఇవ్వాలని అడిగినట్లు ఆయన చెపుతున్నప్పటికీ, సీట్ల సర్దుబాట్లపై ఆయన కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విమర్శలు చేయకపోవడాన్ని బట్టి కాంగ్రెస్, టిడిపిలు పంచుకోగా మిగిలిన 10 సీట్లలో టిజేఎస్, సిపిఐ పార్టీలు సర్దుకుపోక తప్పదని ఆయన గ్రహించి అందుకు సిద్దపడినట్లే భావించవచ్చు. 

కానీ కాంగ్రెస్(95), టిడిపి(14) స్థానాలు పంచుకొన్నట్లు ప్రకటించడంతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరమణ నిన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు తమ పార్టీ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించుకొని తమ భవిష్య కార్యాచరణ ప్రకటిస్తామని ప్రకటించారు. ఈ నేపద్యంలో నేడు మహాకూటమి నేతలు హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్, టిడిపి, టిజేఎస్ మూడు పార్టీల నేతలు నేడు చాడా వెంకటరమణకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించవచ్చు. వారి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో సమావేశం అనంతరం నాలుగు పార్టీల నేతలు చేయబోయే సంయుక్త ప్రకటనతో స్పష్టం అవుతుంది. కనుక ఈరోజు జరుగబోతున్న మహాకూటమిలో సమావేశం వారికి సెమీ ఫైనల్స్ వంటిదేనని చెప్పవచ్చు. మరి ఫైనల్స్ ఎప్పుడంటే డిసెంబర్ 7న పోలింగ్ జరిగినప్పుడని భావించవచ్చు.