.jpg)
మంత్రి కేటిఆర్ శుక్రవారం సిరిసిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్-టిడిపిల పొత్తులను ఎద్దేవా చేశారు. ముసలినక్క (కాంగ్రెస్) గుంటనక్క (చంద్రబాబు నాయుడు) కలిసి తెలంగాణకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టిడిపిని స్థాపించారని, ఆ తరువాత చంద్రబాబునాయుడు కూడా కాంగ్రెస్ పార్టీని, దాని నేతలను తీవ్రంగా వ్యతిరేకించారని, కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో బాబు పొత్తులు పెట్టుకొన్నారని మంత్రి కేటిఆర్ ఆక్షేపించారు. తద్వారా చంద్రబాబు స్వర్గంలో ఉన్న తన మామ ఎన్టీఆర్ కు మరోసారి వెన్నుపోటు పొడిచారని కేటిఆర్ ఎద్దేవా చేశారు.
సిఎం కేసీఆర్‌ను గద్దె దించి రాష్ట్రంలో తాము అధికారంలోకి రావాలనే ఆరాటంతోనే కాంగ్రెస్, టిడిపిలు పొత్తులు పెట్టుకొంటున్నాయని అన్నారు. ఒకప్పుడు అవినీతి కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి తరిమికొట్టి దేశాన్ని కాపాడుతామని బయలుదేరిన చంద్రబాబు, మళ్ళీ ఇప్పుడు దేశాన్ని రక్షిస్థానంటూ బయలుదేరి అదే అవినీతి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో ఏదోవిధంగా అధికారం చేజిక్కించుకోవాలని చేతులు కలిపి ప్రజల ముందుకు వస్తున్న కాంగ్రెస్-టిడిపిలకు గట్టిగా బుద్ది చెప్పి రాష్ట్రాన్ని వారి బారి నుంచి కాపాడుకోవాలని మంత్రి కేటిఆర్ విజ్నప్తి చేసారు.