
ఈసారి ఎన్నికలలో బిజెపి 119 స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తున్నప్పటికీ పోటీ ప్రధానంగా తెరాస-మహాకూటమి మద్యనే జరుగబోతోందని అందరికీ తెలుసు. కనుక బిజెపిలో టికెట్ల కోసం ఒత్తిడి ఉండబోదని భావిస్తే అది పొరపాటేనని స్పష్టం చేస్తున్నట్లు శేరిలింగపల్లి, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలలో ఆశావాహుల నిరసనలు సాగాయి. ఇవాళ్ళ బిజెపి ప్రకటించిన రెండవ జాబితాయే అందుకు కారణం.
నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశిస్తున్న సూర్యనారాయణ వర్గీయులు ఆ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణకు కేటాయించడంతో స్థానిక బిజెపి కార్యాలయంపై దాడి చేసి లోపల ఉన్న ఫర్నీచర్, కిటికీ అద్దాలు వగైరా ద్వంశం చేసి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక శేరిలింగంపల్లి టికెట్ ఆశిస్తున్న కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, డాక్టర్ నరేష్ వర్గీయులు ఆ స్థానాన్ని యోగానంద్ కు కేటాయించడంతో ఆగ్రహం స్థానిక బిజెపి కార్యాలయం ముందు నిరసనదీక్షలు చేపట్టి యోగానంద్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తమకు కేటాయించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్, తెరాస, టిడిపిలలో ఇటువంటి సంఘటనలు సహజంగానే అనిపిస్తాయి కానీ తెరాసకు కంచుకోటవంటి నిజామాబాద్లో టికెట్ కోసం బిజెపి నేతలు కీచులాడుకోవడం విచిత్రంగానే ఉంది.