
ఓటుకు కేసుపై ఏళ్ళకొద్దీ విచారణ కొనసాగడాన్ని ప్రశ్నిస్తూ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో ఒక పిటిషను దాఖలు చేశారు. ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలని కోరారు. ఆ పిటిషనుపై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఆ కేసును 2019 ఫిబ్రవరి నెలకు వాయిదా వేసింది.
ఈ కేసులో చంద్రబాబు నాయుడు తరపున ప్రముఖ న్యాయవాది సిద్దార్ద వాదించారు. కేవలం రాజకీయ శతృత్వం కారణంగానే వైకాపా నేత ఈ కేసు వేశారని, ఫిబ్రవరి-మార్చి నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కనుక వాయిదా వేయాలని వాదించారు. కానీ న్యాయమూర్తి అందుకు అంగీకరించలేదు. ఒకవేళ సుప్రీంకోర్టు అప్పుడు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా తీర్పు చెప్పినట్లయితే అది సార్వత్రిక ఎన్నికలలో టిడిపికి తీవ్ర నష్టం కలిగించవచ్చు.