టి-కాంగ్రెస్‌కు జలగం గుడ్ బై?

ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు తెరాసలో చేరేందుకు సిద్దం అవుతున్నారు. గత రెండు దశాబ్ధాలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ తనపై విధించిన ఆరేళ్ళ బహిష్కరణను ఎత్తివేయడంతో మళ్ళీ పార్టీలో చేరాలనుకొన్నారు. కానీ మంత్రిగా చేసిన ఆయన పార్టీలోకి వస్తే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఆశిస్తారు కనుక ఆయన వలన తమకు నష్టం జరుగుతుందని భావించిన జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్‌ నేతలు ఆయన పునరాగమనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై పునరాలోచనలో పడ్డారు. ఆయన పరిస్థితిని గమనించిన మంత్రి కేటిఆర్‌ ఆయనను పార్టీలోకి ఆహ్వానించగా ప్రసాదరావు సానుకూలంగా స్పందించారు. ఇవాళ్ళ తన అనుచరులతో మాట్లాడి తెరాసలో చేరికపై నిర్ణయం  ప్రకటిస్తానని తెలిపారు. ఆయన శనివారం సాయంత్రం సిఎం కేసీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.