8.jpg)
మహాకూటమిలో కాంగ్రెస్, టిడిపి సీట్ల కేటాయింపు పూర్తయింది కనుక ఇక తెలంగాణ జనసమితి వంతు. సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించేందుకు ప్రొఫెసర్ కోదండరామ్ తన పార్టీ నేతలతో కలిసి గురువారం డిల్లీ వెళ్లారు. రేపు ఉదయం ఆయన రాహుల్ గాంధీ తదితరులతో సమావేశం కానున్నారు.
టిడిపికి 14 సీట్లు కేటాయించగా ఇక మిగిలినవి 10 మాత్రమే కనుక వాటిలో 8 సీట్లు తమకు కేటాయించాలని అడగబోతున్నట్లు సమాచారం. అయితే ఇంకా సిపిఐకి కూడా సీట్లు కేటాయించవలసి ఉంది కనుక చెరో 5 సీట్లతో సర్దుకుపోవలసిందిగా కాంగ్రెస్ పార్టీ కోరే అవకాశం ఉంది. కానీ అందుకు ప్రొఫెసర్ కోదండరామ్ అంగీకరిస్తారో లేదో చూడాలి.
ఎందుకంటే, ఆయన 15-18 సీట్లు కోరితే కాంగ్రెస్ పార్టీ తమకు కేవలం 4-5 సీట్లు విదిలించడాన్ని టిజేఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవలసిన అవసరం ఏమిటని వారు కోదండరామ్ ను నిలదీస్తున్నారు. కానీ కోదండరామ్ మాటకు కట్టుబడి సంయమనం పాటిస్తున్నారు. కనుక కోదండరామ్ ఒకపక్క పార్టీ నేతల ఒత్తిడిని తట్టుకొంటూ మరోపక్క కాంగ్రెస్ పార్టీ నుంచి తన పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే ఎట్టి పరిస్థితులలో మహాకూటమిని వీడకూడదని నిర్ణయించుకొన్నందున కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సీట్లతో సర్ధుకుపోక తప్పదు. ఒకవేళ తెలంగాణ జనసమితికి 5-6 సీట్లు కేటాయిస్తే సిపిఐ పార్టీ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.