కేసీఆర్‌ గురించి కేటిఆర్‌ ఎమన్నారంటే...

రాజకీయ నాయకులు ఒకరికొకరు విమర్శించుకోవడానికో లేక పొగుడుకోవడానికో వేరే దేనితోనో పోల్చి మాట్లాడుతుంటారు లేదా కొన్ని పదాలకు కొత్త అర్ధాలు చెపుతుంటారు. మంత్రి కేటిఆర్‌ కూడా ఈరోజు తన తండ్రి కేసీఆర్‌ రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి చేస్తున్న పనులను చాటి చెప్పేందుకు కేసీఆర్‌ అనే మూడు అక్షరాలకు ఒక కొత్త అర్ధం చెప్పారు. కేసీఆర్‌లో కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అని కొత్త అర్ధం చెప్పారు. ఇవాళ్ళ కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తెరాస కార్యకర్తలతో సమావేశం అయినప్పుడు ఈ సరికొత్త భాష్యం చెప్పారు.

సిఎం కేసీఆర్‌ తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని కృషి చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డుతగులుతోందని, కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తున్న ఆ అవరోధాలను అన్నిటినీ అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి కేటిఆర్‌ చెప్పారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికే అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇక చంద్రబాబు నాయుడు తోడయ్యారని, పొరపాటున మహాకూటమి అధికారంలోకి వస్తే, ప్రాజెక్టులన్నీ స్తంభించిపోతాయని, రాష్ట్రం ఏర్పడక మునుపు తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు మళ్ళీ దాపురిస్తాయని, కనుక తెరాసను గెలిపించుకోవడం చాలా అవసరమని మంత్రి కేటిఆర్‌ అన్నారు.