కాంగ్రెస్‌ టికెట్లు బాబు చేతిలో...కేటిఆర్‌

ఇదివరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతల టికెట్లను డిల్లీలో వారి అధిష్టానం ఖరారు చేసేది కానీ ఈసారి ఎన్నికలలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేస్తున్నారంటూ మంత్రి కేటిఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం మక్తల్, అచ్చంపేట నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి కేటిఆర్‌ మాట్లాడుతూ, “పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిల్లీ వెళ్ళి టికెట్ల కోసం తమ అధిష్టానాన్ని కాక ఏపీ భవన్ లో బస చేసిన చంద్రబాబు నాయుడుని కలిసి తమ పార్టీ టికెట్ల గురించి ఆయనతో చర్చలు జరిపారు. కాంగ్రెస్‌ నేతల టికెట్లనే చంద్రబాబు నిర్ణయిస్తున్నప్పుడు, ఒకవేళ రేపు మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన తన చెప్పు చేతలలో ఉంచుకొనే ప్రయత్నం చేయకుండా ఉంటారా?తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడుతామని చెపుతున్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏపీ భవన్‌లో చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాయడం సిగ్గుచేటు. ఇటువంటి కాంగ్రెస్‌ పార్టీయా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది?” అని ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా గత నాలుగేళ్ళలో తమ ప్రభుత్వం పాలమూరు అభివృద్ధికి ఏవిధంగా కృషి చేసింది? దాని వలన ఎటువంటి సత్ఫలితాలు కనిపిస్తున్నాయిప్పుడు? మళ్ళీ తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పాలమూరు అభివృద్ధికి ఏమేమి చేయబోతోంది? అనే అంశాలను మంత్రి కేటిఆర్‌ ప్రజలకు వివరించారు. ఇదేవిధంగా శరవేగంగా రాష్ట్రాభివృద్ధి జరగాలంటే మళ్ళీ తెరాసకే ఓటు వేసి గెలిపించుకోవాలని ఆయన ప్రజలను కోరారు.