ఎన్నికల కోలాహలంలో బతుకమ్మ చీరల రవాణా!

ఖమ్మం పట్టణంలో శుక్రవారం కలకలం రేగింది. ఒక లారీలో బతుకమ్మ చీరలను తీసుకువెళుతున్నట్లు సమాచారం అందడంతో ప్రతిపక్షనేతలు వైరా రోడ్డులో గల రేణుక జిన్నింగ్ మిల్లు వద్ద కాపుకాసి ఆ లారీని పట్టుకొన్నారు. దానిలో 25,120 బతుకమ్మ చీరలున్నాయి. వాటిని తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూం కో-ఆపరేటివ్ లిమిటెడ్ నుంచి లక్ష్మీదేవిపల్లి మార్కెట్ గోదాముకు తరలిస్తున్నట్లు వే-బిల్స్ ఉండటంతో ప్రతిపక్ష నేతలు శాంతించారు. ఈ సంగతి తెలుసుకొని ఖమ్మం ఏసీపీ వెంకట్రావ్ అక్కడకు చేరుకొని, లారీ డ్రైవర్ నుంచి వే-బిల్ తీసుకొని పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి జీ.గోపాల్ పేరుతో ఆ బిల్లు ఉండటం, బిల్లులో పేర్కొన్నట్లుగా లారీలో 25,120 బతుకమ్మ చీరలు మాత్రమే ఉన్నాయని నిర్ధారించుకొన్నారు. అయినప్పటికీ ప్రతిపక్ష నేతల అనుమానాలు నివృత్తి చేసేందుకు లారీలోని ఆ చీరలనన్నిటినీ క్రిందకు దింపించి తనికీ చేశారు. ఆ చీరల బస్తాలలో డబ్బు లేదని నిర్ధారించుకొన్నాక ఆ వాహనాన్ని విడిచిపెట్టారు.

దీనిపై చేనేత బోర్డు అధికారి ఒకరు స్పందిస్తూ, బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో మహిళలకు చీరలను పంచాలని భావించింది. కానీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వాటిని పంపిణీ చేయకుండా గోదాములలోనే ఉంచేసింది. బతుకమ్మ పండుగ అయిపోయింది కనుక ఆ చీరలను జిల్లాలవారీగా గోదాములకు పంపిస్తుంటే, వాటిని మహిళలకు పంపిణీ చేయడానికే తరలిస్తున్నామనే అపోహతో ప్రతిపక్షనేతలు అడ్డుకొన్నారు. కానీ వాటిని జిల్లా కేంద్రాలలో గోదాములకు తరలిస్తున్నామని నచ్చజెప్పి వాటికి సరైన పత్రాలు కూడా చూపించడంతో వారు వెనక్కు తగ్గారు,” అని చెప్పారు.