
ప్రజాగాయకుడు గద్దర్ ఇటీవల డిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలిసిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదు కానీ మహాకూటమిలో అన్ని పార్టీలు తనకు మద్దతు ఇస్తే తాను గజ్వేల్ నుంచి సిఎం కేసీఆర్‌పై పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని చెపుతున్నారు. అంటే గజ్వేల్ నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తే ఆ పార్టీలో చేరుతానని చెపుతున్నట్లే ఉంది.
కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “అటు కేంద్రంలో బిజెపి, ఇక్కడ రాష్ట్రంలో తెరాస పాలనలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయి. తెరాస పాలనలో తెలంగాణలో మళ్ళీ భూస్వామ్య, కుల వ్యవస్థలు పురుడుపోసుకొంటున్నాయి. కనుక ఆ రెండు పార్టీలు ఈ ఎన్నికలలో కూడా గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, ప్రజాహక్కులు, స్వేచ్చ పూర్తిగా హరించుకుపోయే ప్రమాదం ఉంది. కనుకనే మహాకూటమి నాకు మద్దతు ఇస్తే నేను గజ్వేల్ నుంచి సిఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని చెప్పానని చెపుతున్నాను కానీ ఇంతవరకు ఏ పార్టీకూడా నా ప్రతిపాదనపై స్పందించలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాను తప్ప ఆ పార్టీలో చేరను,” అని గద్దర్ చెప్పారు.