3.jpg)
మంత్రి కేటిఆర్ శనివారం సాయంత్రం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఒక సంచలన విషయం బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీసులు విలేఖరులమని చెప్పుకొంటూ శుక్రవారం ధర్మపురిలో సర్వే చేస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చి నిలదీయగా వారు తాము ఆంధ్రా పోలీసులమని ఒప్పుకొన్నారని, వారిని స్థానికులు పోలీసులకు అప్పగించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీసులకు తెలంగాణలో ఏం పని? అని మంత్రి కేటిఆర్ ప్రశ్నించారు. నిన్న పట్టుబడిన ఆంధ్రా పోలీసుల వివరాలు తమ వద్ద ఉన్నాయని తగిన సమయంలో వాటిని బయటపెడతామని అన్నారు.
చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్ నేతలపై నమ్మకం లేకనే ఆంధ్రా ఇంటెలిజెన్స్ పోలీసుల చేత మళ్ళీ రహస్యంగా సర్వేలు చేయించుకొంటున్నారని కేటిఆర్ ఆరోపించారు. ఆంధ్రా ప్రజలు చెల్లిస్తున్న పన్ను సొమ్మును చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎన్నికల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని, ఆంధ్రా ఇంటెలిజెన్స్ పోలీసుల ద్వారా ఆ డబ్బును ఓటర్లకు పంచుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీతో చేసుకొన్న ఒప్పందంలో భాగంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఎన్నికల ప్రచారఖర్చులు, ఓటర్లకు డబ్బు పంపిణీ కోసం రూ. 500 కేటాయించారని మంత్రి కేటిఆర్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఇటువంటి అరాచకాలు చేస్తుంటే తెరాస చూస్తూ ఊరుకోదని కేటిఆర్ హెచ్చరించారు. ఆంధ్రా ఇంటెలిజెన్స్ పోలీసులపై ఎన్నికల సంఘం తక్షణం చర్యలు తీసుకోవాలని కేటిఆర్ డిమాండ్ చేశారు.