
కేంద్ర ప్రభుత్వం హడావుడిగా ఇద్దరు సిబిఐ డైరెక్టర్లను తొలగించి, మరో 13 మందిని ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన గురువారం డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ఇద్దరు సిబిఐ డైరెక్టర్లను పదవులలో నుంచి తొలగించడానికి, 13 మందిని ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడానికి మోడీ సర్కార్ ఏవో కారణాలు చెపుతున్నప్పటికీ అసలు కారణం వేరే ఉంది. రాఫెల్ యుద్దవిమానాల కొనుగోలులో జరిగిన అవినీతిపై సిబిఐ దర్యాప్తు చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ అడ్డంగా దొరికిపోతారనే భయంతోనే అర్ధరాత్రి వారిని పదవులలో నుంచి తప్పించి తమకు అనుకూలమైన వ్యక్తిని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. సిబిఐ డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టిన ఆ అధికారి (మన్నెం నాగేశ్వరరావు) తక్షణమే రంగంలో దిగి, ఆ ఇద్దరు సిబిఐ అధికారుల కార్యాలయాలను, వాటిలో ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు.
సిబిఐ డైరెక్టర్లను నియమించాలన్నా పదవిలో నుంచి తొలగించాలన్నా ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడితో కూడిన కమిటీ సమావేశమయ్యి నిర్ణయం తీసుకోవాలి. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఎవరికీ తెలియజేయకుండా అర్ధరాత్రి హడావుడిగా ఇద్దరు సిబిఐ డైరెక్టర్లను పదవులలో నుంచి తొలగించి, ఆ స్థానంలో మరో అధికారిని నియమించడం అనుమానించవలసిన విషయమే. ఇది భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిని అవమానించడంగానే భావించవచ్చు. ప్రధాని మోడీ ప్రభుత్వ వ్యవస్థలను ఏవిధంగా నాశనం చేస్తున్నారో అర్ధం చేసుకోవడానికి ఇది చక్కని ఉదాహరణ అని చెప్పవచ్చు,” అని రాహుల్ గాంధీ అన్నారు.