
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిఎం కేసీఆర్‌పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “సిఎం కేసీఆర్‌కు అసలు ఎవరి మాట వినే అలవాటు లేదు. తెలంగాణ రాష్ట్రం గురించి తనకు మాత్రమే పూర్తి అవగాహన ఉందని, అన్ని సమస్యలను తాను మాత్రమే పరిష్కరించగలనని అనుకొంటుంటారు. అందుకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాక తన కలలకు అనుగుణంగా తెలంగాణను నిర్మించే పనులు చేసుకుపోతున్నారు. తన అభిప్రాయాలూ, ఆలోచనలు, నిర్ణయాలనే రాష్ట్రంపై, ప్రజలపై ఆయన బలవంతంగా రుద్దుతున్నారు. ప్రజలు ఏమి కోరుకొంటున్నారు? అని ఆయన ఏనాడూ తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆయనకు వినే అలవాటు లేదు. అందుకే తెలంగాణ ప్రజలకి ప్రభుత్వానికి మద్య దూరం పెరిగిపోయింది. ప్రభుత్వంపై ప్రజలకు క్రమంగా నమ్మకం సన్నగిల్లుతోంది.
దీనికంతటికీ కారకుడు సిఎం కేసీఆరే. ఆయన మోడీకి ప్రతిరూపం...చిన్న రూపం అని చెప్పవచ్చు. ఇద్దరికీ ప్రజల మాట వినే అలవాటు లేదు. ఇద్దరివీ నిరంకుశ పోకడలే. ఇద్దరికీ ప్రజాస్వామ్య విధానాలు నచ్చవు. పాటించరు. ఇద్దరూ పటిష్టమైన వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. మా పార్టీ ఆలోచనా విధానం ఇందుకు పూర్తి భిన్నమైనది. మాకు ప్రజల మాట వినే అలవాటుంది. వారు ఏమీ కోరుకొంటున్నారో తెలుసుకొని అందుకు అనుగుణంగా పాలన సాగిస్తుంటాము. మోడీ, కేసీఆర్ ప్రజలను రకరకాల వర్గాలుగా విభజించి పాలిస్తుంటే, మేము అందరినీ కలుపుకుపోతూ ముందుకు సాగుతాము. మాకు, ప్రధాని మోడీ, సిఎం కేసీఆర్‌కు మధ్య ఇదే ప్రధానమైన తేడా. అందుకే దేశప్రజలు మావైపు చూస్తున్నారిప్పుడు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం. అధికారంలోకి వచ్చేక ప్రజల ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తాము,” అని రాహుల్ గాంధీ అన్నారు.