అందుకే రాజకీయాలలోకి వచ్చాను: స్వామీజీ

ఇటీవల బిజెపిలో చేరిన స్వామి పరిపూర్ణానంద బుదవారం హైదరాబాద్‌ తిరిగివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను హైదరాబాద్‌ నగర బహిష్కరణ చేసినందుకే రాజకీయాలలోకి వెళ్లాలనే ఆలోచన కలిగిందని చెప్పారు. అయితే గత రెండు దశాబ్ధాలుగా బడుగుబలహీన వర్గాలవాడలలో తిరుగుతూ వారి దయనీయ స్థితిగతులను కళ్ళారా చూశానని, వారి జీవితాలలో వెలుగులు నింపాలనే అంతరంగంలో ఒక బలమైన ఆలోచన ఉండేదని అది కూడా తన రాజకీయ ప్రవేశానికి ఒక కారణమని చెప్పారు. 

రాజకీయాలలో చేరినప్పటికీ తనకు ఏ పదవులు అవసరం లేదని, రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. మిషన్-70 పేరుతో 70 అసెంబ్లీ సీట్లు గెలుచుకొనేందుకు అమిత్ షా వ్యూహరచన చేశారని, రాష్ట్ర బిజెపి నేతలతో కలిసి దానిని అమలుచేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు సమైక్య రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలన్నీ ‘దారుసలామ్’ కనుసన్నలలో నడిచాయని, ఇకపై ‘లాల్ దర్వాజా’ కేంద్రంగా నడుస్తాయని చెప్పారు. రాష్ట్రమంతటా కాషాయ జెండాలు రెపరెపలాడటం తధ్యమని స్వామీజీ చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను, పార్టీల బలాబలాలను, సమీకరణాలను అన్నిటినీ వాస్తవ దృష్టితో చూసినట్లయితే బిజెపి అధికారంలోకి రావడం అసాధ్యమేనని అందరికీ తెలుసు.

అది వేరే సంగతి. కానీ సమాజాసేవ, ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమై ఉన్న స్వామి పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేయడం ద్వారా తెరాస చేజేతులా ఒక కొత్త శత్రువును సృష్టించుకొందని చెప్పకతప్పదు. ఆయన వలన తెరాసకు పెద్దగా నష్టం ఉండకపోవచ్చు కానీ బిజెపికి ఖచ్చితంగా ఎంతో కొంత మేలు కలగడం ఖాయం అని భావించవచ్చు. ఒకవేళ ఆయన బిజెపి తరపున హైదరాబాద్‌లో తెరాసకు కీలకమైన నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగితే ఆ స్థానంలో తెరాసకు చాలా నష్టమే కలుగవచ్చు. చివరిగా ఒక మాట చెప్పుకోవాలి. సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ ‘బిగ్ బాస్’ షో ద్వారా పాపులర్ అయితే, ఆయనతో విభేధించడం ద్వారా స్వామి పరిపూర్ణానంద రాజకీయాలలోకి ప్రవేశించడం విశేషం.