
సిబిఐ అంటే అవినీతి, అక్రమాలను, కుట్రలు కుతంత్రాలపై దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చే సంస్థ. అయితే నిప్పులాగా స్వచ్చమగా ఉండవలసిన ఆ సిబిఐకే రాజకీయాలు, అవినీతి చీడ పట్టి చాలా కాలమే అయ్యింది. అయితే సిబిఐ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఆ సంస్థను నడిపిస్తున్న డైరెక్టర్ అలోక్‌వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలపై అవినీతి ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం వారిద్దరినీ శలవులో పంపించి మన్నెం నాగేశ్వరరావుకు సిబిఐ పగ్గాలు అప్పగించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
నాగేశ్వరరావు సిబిఐ బాధ్యతలు స్వీకరించగానే డిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో వారిరువురి కార్యాలయాలు స్వాధీనం చేసుకొని సోదాలు నిర్వహించడం చూసి దేశప్రజలు ముక్కున వేలేసుకొంటున్నారు. వారిరువురితో పాటు సిబిఐలో వారి అనుచరులుగా చెప్పబడుతున్న మరో 13 మంది ఉన్నతాధికారులను నిన్న రాత్రి వేరే రాష్ట్రాలకు బదిలీ చేయడం మరో విశేషం.
మరో విశేషమేమిటంటే, కొత్తగా సిబిఐ డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టిన మన్నెం నాగేశ్వరరావుపై కూడా అనేక అవినీతి ఆరోపణలున్నాయని అటువంటి వ్యక్తిని సిబిఐ డైరెక్టరుగా నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. సిబిఐలో జరుగుతున్న ఈ పరిణామాలు దానిపై ప్రజలు నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయని చెప్పకతప్పదు.