
నల్గొండ జిల్లాలో తనకు తిరుగులేదని, తాను ఉండగా జిల్లాలో మరో పార్టీ గెలవలేదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తరచూ చెపుతుంటారు. అలాగే ఈసారి జిల్లాలో 12 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తే తెలంగాణకు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెపుతున్నారు. దాదాపు మూడు దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న తాను సిఎం, పిసిసి అధ్యక్ష పదవులు ఆశించడం తప్పు కాదని ఆయనే స్వయంగా చెప్పారు. కనుక ఆయన కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారనే స్పష్టం అవుతోంది.
అయితే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని కలలు కనే ముందు తనను ఓడించి చూపాలని నల్గొండ తెరాస అభ్యర్ధి కంచర్ల భూపాలరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సవాలు విసిరారు. ఆయన నల్గొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “గత ఇరవై ఏళ్ళుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకు చేసిందేమీ లేదు. నేటికీ నల్గొండలో అనేకచోట్ల మట్టి రోడ్లే ఉన్నాయంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టి ఎప్పుడూ దౌర్జన్యాలు, భూకబ్జాలు, పదవులు, అధికారం మీదే ఉంటుంది తప్ప తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రయత్నించలేదు. అందుకే నల్గొండ ప్రజలు ఈసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడించి బుద్ది చెప్పబోతున్నారు. కనుక ముఖ్యమంత్రి పదవి గురించి కలలు కంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుగా నన్ను ఓడించి చూపాలని సవాలు చేస్తున్నాను. ఈసారి ఎన్నికలలో నన్ను గెలిపిస్తే, నల్గొండ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను,” అని కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.