
మంత్రి కేటిఆర్ మంగళవారం సాయంత్రం ఇబ్రహీంపట్నంలో తెరాస కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ మహాకూటమిపై తనదైన శైలిలో చురకలు వేశారు. “కాంగ్రెస్ పార్టీలోనే జిల్లాకు 10 మంది చొప్పున ముఖ్యమంత్రి అభ్యర్ధులున్నారు. ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే నాలుగు పార్టీలు కలిసి నెలకొక ముఖ్యమంత్రి చొప్పున 60 నెలలలో 60 మంది ముఖ్యమంత్రులతో రాష్ట్రాన్ని పాలిస్తారేమో? అది కూడా డిల్లీ నుంచి సీల్డ్ కవరులో పేర్లు వస్తాయి. మనకు మన తెలంగాణ బిడ్డ సింహం లాంటి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలో లేక సీల్డ్ కవరు ముఖ్యమంత్రి కావాలో మీరే నిర్ణయించుకోండి. మహాకూటమి జుట్టు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. ఆయన చెప్పినట్లుగానే కాంగ్రెస్ నేతలు ఆడుతున్నారు. మహాకూటమిలో సీట్ల పంచాయితీ ఇప్పట్లో తేలేది కాదు. అది సీట్లు పంచుకొనేలోపే మనం ఎన్నికలలో గెలిచి స్వీట్లు పంచుకొందాం,” అని మంత్రి కేటిఆర్ అన్నారు.
ఈ ఎన్నికల తరువాత వరుసగా పంచాయితీ, మున్సిపాల్, లోక్ సభ ఎన్నికలు వస్తాయి కనుక, ఈ ఎన్నికలలోనే నేతలు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి భారీ మెజార్టీతో అభ్యర్ధులను గెలిపించుకోవాలని మంత్రి కేటిఆర్ కోరారు. తద్వారా రానున్న ఇతర ఎన్నికలలో మీపని సులువు అవుతుందని చెప్పారు.
ఇక ఇబ్రహీంపట్నం వద్ద రూ. 16-17,000 కోట్లు వ్యయంతో ఒక రీజనల్ రింగ్ రోడ్ నిర్మించబోతున్నామని మంత్రి కేటిఆర్ ప్రకటించారు. అదీకాక మంగలపల్లి, బాట సింగారం వద్ద లాజిస్టిక్ పార్కులు తయారవుతున్నాయని తెలిపారు. అతి త్వరలోనే ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు, పొలాలకు అవసరమైన సాగునీరు ఏర్పడబోతున్నాయని అప్పుడు ఇబ్రహీంపట్నం ముఖచిత్రమే మారిపోనుందని అన్నారు. అవుటర్ రింగ్ రోడ్- రీజనల్ రింగ్ రోడ్ మద్యన ఉండబోయే ఇబ్రహీంపట్నం రాష్ట్రంలో ఒక ప్రముఖ పట్టణంగా రూపాంతరం చెందబోతోందని కనుక ఎవరూ తొందరపడి తమ భూములను అమ్ముకోవద్దని మంత్రి కేటిఆర్ సూచించారు.