మహాకూటమికి కోదండరామ్ డెడ్-లైన్?

మహా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, టిజేఎస్, టిడిపి, సిపిఐ సీట్ల సర్ధుబాట్లపై చర్చలు ఇప్పట్లో ముగిసేలా లేకపోవడంతో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ 48 గంటలలోగా సీట్ల సర్దుబాట్ల సంగతి తేల్చేయాలని లేకుంటే తమ దారి తాము చూసుకొంటామని తేల్చి చెప్పిన్నట్లు సమాచారం. టిజేఎస్ కనీసం 15 సీట్లు ఇవ్వాలని కోదండరామ్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. కానీ టిజేఎస్ కు 3-5 సీట్ల కంటే మించి ఇవ్వడానికి కాంగ్రెస్ ఇష్టపడటం లేదు. 

మిత్రపక్షాలు కోరినట్లు అన్నిటికీ కలిపి 40 సీట్లు ఇచ్చేస్తే కాంగ్రెస్ పార్టీలో 40 మంది అసంతృప్తికి గురవుతారు. ఆ కారణంగా పార్టీలో లుకలుకలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. అదీగాక తెరాసను డ్డీకొనగల బలమైన అభ్యర్ధులు లేనప్పుడు టిజేఎస్ కు అన్నీ సీట్లు కేటాయించడం వలన పరోక్షంగా తెరాసను గెలిపించినట్లవుతుందని కాంగ్రెస్ నేతల వాదిస్తున్నారు. కనుక తమకు బలమున్న స్థానాలను ఎట్టి పరిస్థితులలో వదులుకోకూడదని కాంగ్రెస్ నేతలు పట్టుదలగా ఉన్నారు. 

ఒకవేళ మహా కూటమిలో నుంచి టిజేఎస్ బయటకు వచ్చేస్తే అది అడిగినన్ని సీట్లు కేటాయించి పొత్తులు పెట్టుకోవాలని బిజెపి భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోదండరామ్ ఎలాగూ డెడ్-లైన్ విధించినట్లు తెలుస్తోంది కనుక మరో 48 గంటలలో మహాకూటమిలో ఏఏ పార్టీలకు ఎన్ని సీట్లు దక్కుతాయి? ఏవి మహా కూటమిలో ఉంటాయి? ఏవి బయటకుపోతాయనే దానిపై స్పష్టత రావచ్చు.