ఆమె కూడా ఓ పిటిషన్ పడేశారు

తెలంగాణా శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ కూడా విడుదలవడంతో ముందస్తు ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకపక్క ఎన్నికల ప్రచారం సాగిస్తూనే మరోపక్క ఎన్నికలను వ్యతిరేకిస్తూ పిటిషన్లు వేస్తుండటమే ఈసారి ఎన్నికలలో ప్రత్యేకత. సీనియర్ కాంగ్రెస్‌ నేత డి‌కె అరుణ ఎన్నికల షెడ్యూల్ ను సవాలు చేస్తూ సోమవారం హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “శాసనసభలో కేవలం టిఆర్ఎస్‌ సభ్యులు మాత్రమే ఉన్నట్లయితే ఆయన శాసనసభను ఎప్పుడు రద్దు చేసుకొన్నా ఎవరూ అడగరు. కానీ శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు కూడా ఉన్నప్పుడు, శాసనసభను ఎందుకు రద్దు చేయాలనుకొంటున్నారో వారికి ముందుగా తెలియజేయాలనే ఆలోచన కూడా చేయకుండా ఏకపక్షంగా రద్దు చేశారు. ఇది రాజ్యాంగ విరుద్దం. ముందస్తు ఎన్నికల వలన రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రెండు నెలలపాటు పాలన స్తంభించిపోయింది. శాసనసభ ఎన్నికలైపోగానే లోక్‌సభ ఎన్నికలు వస్తాయి కనుక మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది. ఆ తరువాత పంచాయితీ ఎన్నికలకు కోడ్... ఆ తరువాత మున్సిపల్ ఎన్నికల కోడ్...ఇలాగ మరొక సంవత్సరం వరకు రాష్ట్రంలో ఏవో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఆ కారణంగా ఎన్నికల కోడ్ కొనసాగుతూనే ఉంటుంది. అంతవరకు రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోక తప్పదు. అదే...వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలలో సార్వత్రిక ఎన్నికలకు వెళ్ళినట్లయితే అంతవరకు రాష్ట్రంలో పాలన సాగుతుంది కదా! ఈ వరుస ఎన్నికలు ప్రజలకు భారంగా మారినందునే నేను పిటిషన్ వేయవలసి వచ్చింది,” అని డి‌కె అరుణ వివరించారు.