ఓటర్ల జాబితా కేసు విచారణ వాయిదా

ఒకపక్క ఓటర్ల జాబితాలో అవకతవకలపై  హైకోర్టులో విచారణ ఇంకా జరుగుతుండగానే శనివారం సాయంత్రం కేంద్ర ఎన్నికల కమీషన్ తెలంగాణా శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొంది కనుక హైకోర్టు సానుకూలంగా తీర్పు చెప్పవచ్చనే భావనతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ ఓపి రావత్ తెలిపారు. 

ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సీనియర్ కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్ రెడ్డి వేసిన పిటిషనుపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఓటర్ల జాబితాకు సంబందించిన అన్ని వివరాలను, దానిని రూపొందించడం కోసం తీసుకొన్న జాగ్రత్తలను వివరిస్తూ ఒక అఫిడవిట్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు హైకోర్టుకు అందజేసింది. ఈకేసులో మర్రి శశిధర్ రెడ్డి తరపున వాదిస్తున్న న్యాయవాది, ఆ వివరాలను అన్నిటినీ పరిశీలించి అభ్యంతరాలు తెలియజేయడానికి సమయం కావాలని కోరడంతో ఈ కేసు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.