రేపే టిఆర్ఎస్‌ తుది జాబితా?

సెప్టెంబరు 6న  శాసనసభను రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్ధులతో తొలి జాబితా ప్రకటించి సంచలనం సృష్టించిన కెసిఆర్‌, మిగిలిన 14 నియోజకవర్గాలకు ఇంతవరకు అభ్యర్ధులను ప్రకటించకపోవడంతో ఆ నియోజకవర్గాలలో టికెట్ ఆశిస్తున్న అభ్యర్ధులలో ఆందోళన పెరిగిపోతోంది. ఆ కారణంగా వారినుంచి పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతూనే ఉంది. ఆ 14 నియోజకవర్గాలు చాలా కీలకమైనవి కావడంతో మహాకూటమి తన అభ్యర్ధులను ప్రకటించిన తరువాత వారిని బట్టి టిఆర్ఎస్‌ అభ్యర్ధులను ప్రకటించాలని సిఎం కెసిఆర్‌ ఇంతవరకు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. కానీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడినా మహాకూటమిలో సీట్ల సర్దుబాట్ల చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో రేపు అంటే మంగళవారం మిగిలిన 14 నియోజకవర్గాలకు టిఆర్ఎస్‌ అభ్యర్ధులను ప్రకటించాలని సిఎం కెసిఆర్‌ భావిస్తున్నట్లు తాజా సమాచారం. ఈ వార్త నిజమో కాదో రేపు తెలుస్తుంది. ఒకవేళ రేపు మిగిలిన 14 నియోజకవర్గాలకు టిఆర్ఎస్‌ అభ్యర్ధులను ప్రకటించినట్లయితే అప్పుడు మహాకూటమికి ఆ 14 స్థానాలలో గెలుపు గుర్రాలను ఎంచుకొనే అవకాశం లభిస్తుంది.