
రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున ఇక నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పూర్తిస్థాయిలో అమలుచేయబోతున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల కోడ్ మార్గదర్శకాలను వివరించారు.
1. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మద్య ఎన్నికల ప్రచారం నిషేదించబడింది.
2. అధికారులు తప్ప మరెవరూ ప్రభుత్వ వాహనాలను ఉపయోగించరాదు.
3. ప్రభుత్వ కార్యాలయాలు వాటి ప్రాంగణాలలో ఎన్నికలకు సంబందించి ఎటువంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదు. ఫ్లెక్సీ బ్యానర్లను ఏర్పాటు చేయరాదు.
4. బస్సులు, బస్టాండ్లు, వంతెనలు, రైల్వే స్టేషన్లు వగైరా ప్రభుత్వ ఆస్తులపై ఏర్పాటు చేసిన ఎన్నికల పోస్టర్లు, ఫ్లెక్సీ బ్యానర్లు 24 గంటలలో తొలగించాలి.
5. ప్రైవేట్ ఆస్తులపై సదరు యాజమానుల అనుమతి లేకుండా రాజకీయ పార్టీలు ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టరాదు. గోడలపై ఎన్నికల రాతలు వ్రాయరాదు. వాటిపై అభ్యంతరాలు వ్యక్తమయితే 72 గంటలలోగా వాటిని తొలగించాలి.
6. ప్రభుత్వ వెబ్ సైట్లలో మంత్రులు, రాజకీయ నాయకుల ఫోటోలు తక్షణం తొలగించాలి.
7. ప్రజలు లేదా రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు హైదరాబాద్ సీఈఓ కార్యాలయంతో పాటు ప్రతీ జిల్లా కేంద్రంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయబడతాయి.
8. ఎన్నికలకు సంబందించి ఎటువంటి ఉల్లంఘనలు జరిగిణా వాటి గురించి ఎవరైనా సరే 1950 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి పిర్యాదు చేయవచ్చు.
9. ప్రతీరోజు సాయంత్రం 5 గంటలలోగా జిల్లా కలెక్టర్లు ఆరోజున వచ్చిన ఫిర్యాదులను జిల్లా కార్యాలయం ద్వారా హైదరాబాద్ సీఈఓ కార్యాలయానికి పంపించాలి. వాటిని కేంద్ర ఎన్నికల కమీషన్ కు పంపించి దాని ఆదేశాల ప్రకారం తగిన చర్యలు తీసుకోబడతాయి.
ఈ నిబంధనలన్నీ రాష్ట్రంలో తక్షణం అమలులోకి వచ్చినట్లు రజత్ కుమార్ ప్రకటించారు. కనుక రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల కోడ్ ను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.